హైదరాబాద్‌లో "రెండవ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం"
|
దీన్ని పురస్కరించుకుని ఫెస్టివల్ కార్యాలయాన్ని శుక్రవారం సారథి స్టూడియోస్‌లో ఛాంబర్ అధ్యక్షుడు ఎం.ఎస్. రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫెస్టివల్ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తెలుగు చలనచిత్ర పరిశ్రమ అన్ని రంగాల్లో హాలీవుడ్ స్థాయికి చేరుకుందని చెప్పారు. ప్రతి సినిమాలో నేర్చుకోవాల్సిన అంశం.. ఏదో ఒకటి ఉందని ఆయన తెలిపారు.
మొదటి ఫిలిం ఫెస్టివల్‌ను విజయవంతంగా పూర్తి చేసిన స్ఫూర్తిని ఆధారంగా తీసుకుని రెండవ ఉత్సవాన్ని జరపనున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖ నిర్మాతలు, దర్శకులతో కలిసి పాలు పంచుకోవడంతో మరిన్ని విషయాలను తెలుసుకునేందుకు వీలు కలుగుతుందని చెప్పారు.
ప్రస్తుతం ఓవర్సీస్ మార్కెట్లో తెలుగు పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటువంటి ఉత్సవాలను పరిశ్రమలోని అన్నీ వర్గాలవారు సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఎం.ఎస్. రెడ్డి వ్యాఖ్యానిస్తూ... కాలంతో పాటు తాను పరుగెత్తలేకపోయినా నేటి యువత చలనచిత్రరంగంలో వస్తున్న పోకడలను అవపోసన పట్టడానికి ఇది సరైన వేదిక కాగలదని ఆశిస్తున్నానన్నారు.
సి. కళ్యాణ్ మాట్లాడుతూ... నటీనటులుకూడా చేయి కలిపితే ఈ ఉత్సవాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళగలమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇతర దేశాలవారు ఉత్సాహపడే విధంగా ఫెస్టివల్‌ను నిర్వహించాలని సూచించారు.
పరుచూరి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ... గోవా ఫిలిం ఫెస్టివల్‌లో జరిగిన అవమానం నుంచే హైదరాబాద్ ఫెస్టివల్ ఉదయించిందని గుర్తు చేశారు. మొదటి ఫిలిం ఫెస్టివల్‌ను సక్సెస్ చేశామని అన్నారు. ఇలా మూడు సార్లు చేస్తే అంతర్జాతీయ స్థాయిలో మన చిత్రోత్సవాలకు గుర్తింపు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ దిశగా అందరూ కృషి చేయాలని కోరారు.
ఫెస్టివల్ వైస్ ఛైర్మన్ సాగర్ మాట్లాడుతూ... నాలుగు నెలల పాటు ఉత్సవ ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకు తెలుగు చలనచిత్ర రంగంలోని అన్ని శాఖల వారు సహకారాన్ని అందుకుంటామని అన్నారు.
ఫెస్టివల్ డైరక్టర్ ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ... ఈ ఫిలిం ఫెస్టివల్‌లో 150 సినిమాలు ప్రదర్శించబడతాయని, ఇప్పటికే 40 సినిమాలు ఖరారైనట్లు ఆయన వివరాలందించారు. ఇందులో దక్షిణా కొరియా నుంచి 8 సినిమాలు తీసుకొచ్చామని అన్నారు.
వరల్డ్ క్లాసిక్, తెలుగు క్లాసిక్‌తో పాటు ఫ్రాన్స్, హంగేరి, పోలెండ్, రష్యా తదితర దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. ఫిలింసెలక్షన్ కమీటీదారులుగా కె.ఎన్.టి శాస్త్రి, ప్రసాద్‌లు ఉంటారని ఆయన తెలిపారు. ఒక్కొక్క సినిమాకు లక్షరూపాయలు ఖర్చవుతుందని, అందరి సహకారంతో ఫెస్టివల్‌ను మరింత ముందుకు తీసుకొచ్చే నమ్మకం ఉందని ప్రకాష్ రెడ్డి వెల్లడించారు.
ఈ ఉత్సవంలో పాల్గొనే సినిమా ఎంట్రీలను నవంబర్ 20లోగా, షార్ట్ ఫిలిం, డాక్యుమెంటరీలకు డిసెంబర్ 1వ తేదీలోగా పంపగలమని అడ్వయిజరీ మెంబర్ రఘు చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకులు నీలకంఠ, భీమినేని శ్రీనివాస్, కృష్ణమోహన్ రెడ్డి, త్రిపురనేని శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఫెస్టివల్ ఛైర్మన్‌గా డా. దాసరి నారాయణరావు, అడ్వయిజర్స్‌గా డి. రామానాయుడు, సిసిరెడ్డి, నాగబాబు, రమేష్‌ప్రసాద్, సి. కళ్యాణ్, కోటగిరి వెంకటేశ్వరరావు, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.