1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

ధీరవనిత పాత్రలో నటిస్తున్న సంఘవి

ధీరవనిత పాత్రలో నటిస్తున్న సంఘవి
అన్యాయాన్ని ఎదిరించడంతోపాటు సమాజంలో జరిగే మరికొన్ని అన్యాయాలపై పోరాడే ఒక స్త్రీ కథగా రూపొందుతున్న"ఇంద్రాణి" అనే చిత్రంలో చాలా కాలం తరువాత నటి సంఘవి నటిస్తోంది. "లగ్నపత్రిక" సినిమా తరువాత మళ్ళీ అంతటి ప్రాధాన్యత కలిగిన పాత్ర ఇదేనని సంఘవి అంటోంది. ప్రసన్న లక్ష్మీ పిక్చర్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ సినిమా సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. గుడిపాటి నాగేశ్వరరావు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఎం.ఎ. చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు.

లేడీ ఓరియంటెడ్ కథను కలిగిన ఈ "ఇంద్రాణి" సినిమా ముహూర్తపు షాట్ సంఘవి, రఘుబాబు, కృష్ణభగవాన్, దువాసి మోహన్‌లపై చిత్రీకరించారు. దీనికి రాజకీయనాయకుడు సంతోష్ రెడ్డి క్లాప్ కొట్టగా, నిర్మాత శ్రేయోభిలాషి ఆనంద్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. "యమగోల" దర్శకుడు శ్రీనివాసరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ... తనకు, తన కుటుంబానికి జరిగే అన్యాయాన్ని ఎదిరించడంతోపాటు సమాజంలో జరిగే మరికొన్ని అన్యాయాలపై పోరాడే ఒక స్త్రీ కథే "ఇంద్రాణి" అని అన్నారు. సంఘవి పాత్ర ఇందులో రెండు కోణాల్లో ఉంటుందనీ, ఆరు పాటలున్నాయని వీటికి గోరంట్లకృష్ణ బాణీలను సమకూర్చారని చెప్పారు. సోమవారం నుంచి 21 దాకా తొలి షెడ్యూల్, 28 నుంచి నవంబరు 10 దాకా రెండో షెడ్యూల్, ఆ తరువాత మూడో షెడ్యూల్‌తో షూటింగును పూర్తి చేస్తామని తెలిపారు.

ఒక గ్రామంలో టీచర్‌గా పనిచేస్తున్న తనకు జరిగే అన్యాయాన్ని ఎలా ఎదిరించాననేదే చిత్ర కథని, చాలా కాలం తరువాత లేడీ ఓరిటెంటెడ్ కథాంశంతో చేస్తున్నానని, అందరినీ అలరించే చిత్రమవుతుందని నమ్మకముందని సంఘవి చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ... దర్శకుడు చెప్పిన పాయింట్ నచ్చిందనీ, మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే సినిమా ఇదని... అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని సంక్రాంతికి విడుదల చేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్నట్లు చెప్పారు.

ఇప్పటికే నాలుగు పాటల రికార్డింగ్ పూర్తయిందని, ఇంకా రెండు పాటలు చేయాల్సి ఉందనీ, బాలుతో సహా పలువురు గాయనీ గాయకులు ఆలపిస్తున్నారని సంగీత దర్శకుడు గోరంట్ల కృష్ణ తెలిపారు. మాస్ తరహా పాత్రని ఇందులో పోషిస్తున్నానని నటుడు వేణుగోపాల్ తెలిపారు.
About Writer
Selvi