1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

నవంబర్ 27 నుంచి హంగెరీలో "జాన్" పాటల చిత్రీకరణ

నవంబర్ 27 హంగెరీ జాన్ పాటలు చిత్రీకరణ
కృష్ణభగవాన్, సిమ్రాన్ హీరోహీరోయిన్లుగా కూచిపూడి వెంకట్ దర్శకత్వంలో రూపొందుతోన్న "జాన్ అప్పారావు 40 ప్లస్ చిత్రం రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఏర్పాటయిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ... ఇటీవలే విదేశాల్లో షూటింగ్ జరుపుకుని ఈ నెల 3నుంచి ఫిలిం సిటీలో కొన్ని సన్నివేశాలను, పాటలను చిత్రీకరిస్తున్నామని చెప్పారు.

ఈ నెల 24వరకు షెడ్యూల్తో టాకీతో పాటు రెండు పాటలు పూర్తవుతాయని అన్నారు. ఇంకా మూడు పాటల్లో రెండు పాటలను హంగెరీలో నవంబర్ 27వ తేదీ నుంచి ప్రారంభిస్తామని తెలియజేశారు. మరో పాటను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తామని వివరించిన ఆయన చిత్ర కథ ఆద్యంతం ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగుతుందని చెప్పారు. అయితే చివరి భాగం మాత్రం ఎమోషనల్‌గా ఉంటుందన్నారు. కామెడీ, థ్రిల్లర్ సబ్జెక్ట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. నవంబర్‌లో ఆడియోను, జనవరి 14న సినిమాను విడుదలచేయనున్నామని తెలిపారు.

కృష్ణభగవాన్ మాట్లాడుతూ... స్టేజీ మీదనే హీరోగా చేయలేదు.... సినిమాలో హీరోగా చేస్తున్నానంటే అంతా వెంకట్‌ కారణమని అన్నారు. నన్ను ఆలోచించుకుని ఆయన కథను రెడీ చేసుకున్నారని వెల్లడించారు. ఇప్పటికే ఈ చిత్రం 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని చెప్పారు. సిమ్రాన్ వంటి నటి నాతో చేయడం చాలా గొప్పగా ఫీలవుతున్నానని వెల్లడించారు. ఈ చిత్రంలో ఏ మాత్రం గొప్పతనం ఉన్నా ఆ క్రిడిట్ అంతా దర్శకుడిదేనని కృష్ణ భగవాన్ అన్నారు.

తనను సంగీత దర్శకునిగా వెంకట్ పరిచయం చేస్తున్నారని కిరణ్ వారణాసి తెలిపారు. ఈ చిత్రం మొదటి భాగం కామెడీగా రెండో భాగం సస్పెన్స్‌తో ఉంటుందని ఎగ్జిక్యూటివ్ నిర్మాత పి. అనిల్‌కుమార్ రెడ్డి చెప్పారు. సిమ్రాన్ మాట్లాడుతూ... పూర్తి కామెడీ చిత్రమిదని తెలిపారు. గతంలో చేసిన పాత్రల కంటే భిన్నమైన పాత్రని వెల్లడించారు. కృష్ణభగవాన్ టైమింగ్ ఎంతో ఆకట్టుకుందని తెలిపిన ఆమె ఈ చిత్రం అందరికీ గుర్తింపునిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
About Writer
Selvi