1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

డిసెంబరులో "నీ సుఖమే నే కోరుతున్నా" ఆడియో

డిసెంబరులో నీ సుఖమే నే కోరుతున్నా ఆడియో
నటుడు గిరిబాబు దర్శకత్వం వహిస్తోన్న "నీ సుఖమే నే కోరుతున్నా" చిత్రం షూటింగ్ పూర్తిచేసుకోనుంది. రాజా, స్నేహ, హేమశ్రీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో కీలక సన్నివేశాలను చిత్రీకరించుకుంటోంది.

ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ... షూటింగ్ చివరి దశలో ఉందని... ఇంకో వారం రోజుల్లో టాకీ పూర్తవుతుందని అన్నారు. ఇప్పటికే నాలుగు పాటల చిత్రీకరణ పూర్తయిందని వివరించారు. ఓ పాటను బ్యాంకాక్‌లో చిత్రీకరించాలనే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. హైదరాబాద్‌లో ప్రారంభమైన షూటింగ్ ఆయన స్వగ్రామమైన రావినూతలతో పాటు పలు గ్రామాల్లో కూడా చిత్రీకరించామని వెల్లడించారు.

ఈ చిత్రంలో అంతర్లీనంగా ప్రేమకథ ఉన్నా ఫ్యామిలీ డ్రామాదే పై చేయి అని... అన్ని రసాలు సమపాళ్ళలో ఉండేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. డిసెంబరులో ఆడియోను విడుదల చేస్తామని... వీలును బట్టి జనవరి, ఫిబ్రవరి నెలల్లో సినిమాను విడుదల చేస్తామని గిరిబాబు తెలిపారు.

గిరిబాబుగారు తీసిన "సింహగర్జన", "దేవతలారా దీవించండి" వంటి చిత్రాలు ఎంతో పేరు తెచ్చాయని సహనిర్మాతల్లో ఒకరైన కె. సుబ్బారావు అన్నారు. ఇప్పటికీ ఆయనలో ఆనాటి పట్టుదల ఉందని.. ఈ చిత్రం అందరికీ పేరు తెస్తుందని సుబ్బారావు ఆశించారు.

కాలేజీ స్టూడెంట్ ఈ చిత్రంలో నటిస్తున్నానని హీరో రాజా అన్నాడు. ప్రేమలో చిన్నపాటి అపార్థాలు చోటుచేసుకున్నా అవి ఎలా నివృత్తి అయ్యాయి అనే అంశాలను దర్శకుడు ఈ చిత్రంలో చూపించారని చెప్పాడు. ఇంకా ఈ చిత్రంలో కోటశ్రీనివాసరావు, ఉత్తేజ్, రఘుబాబు, రంగనాథ్, నర్రా వెంకటేశ్వరరావు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు: వెన్నెల కంటి, సంగీతం: మాధవ పెద్ది సురేష్.
About Writer
Selvi