1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

అంచనాలు అందుకోని ''సావరీయా'', ''ఓం శాంతి ఓం''

అంచనాలు అందుకోని 'సావరీయా'
WD PhotoWD
దీపావళి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సావరీయా, ఓం శాంతి ఓం బాలీవుడ్ చిత్రాలు సగటు బాలీవుడ్ ప్రేక్షకులు అంచనాను అందుకోవడంలో విఫలమైనట్లు బాలీవుడ్ పండితులు తేల్చి చెప్తున్నారు. స్వీయ నిర్మాణంలో ఫర్హాఖాన్ దర్శకురాలిగా బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ హీరోగా తయారైన 'ఓం శాంతి ఓం', అనిల్ కపూర్, రిషికపూర్ వారసులు సోనమ్ కపూర్, రణ్‌బీర్ కపూర్‌‍లు నాయికా నాయకులుగా సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'సావరియా' చిత్రాలు నువ్వా నేనా అన్న రీతిలో పోటాపోటీగా నవంబర్ 9న, శుక్రవారం నాడు విడుదలయ్యాయి.

జూనియర్ ఆర్టిస్టు పునర్జన్మ కథా నేపథ్యంగా ఓం శాంతి ఓం రూపొందగా, సవారియాలోని హీరోయిన్ సోనమ్ కపూర్ అతిథి పాత్రలో కనపడే సల్మాన్ ఖాన్‌ను ప్రేమిస్తుంది. ఇక హీరో రణ్‌బీర్ కపూర్, సోనమ్ కపూర్‌ను ప్రేమిస్తుంటాడు. ఎవరు ఎవరిని ఎందుకు ప్రేమిస్తున్నారో విడమరచి చెప్పలేని ప్రేమ కధా చిత్రంగా సావరియా తెర మీదకు వచ్చింది.

బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో ఓం శాంతి ఓం చిత్రంలో కనపడతాడు. 1977 నాటి బాలీవుడ్ వాతావరణాన్ని తలపిస్తూ హీరో కావలనకునే జూనియర్ ఆర్టిస్టుగా సినిమా ప్రథమార్థంలో షారూఖ్ కనిపిస్తాడు. ద్వితీయార్ధంలో 2007 నాటి సూపర్ స్టార్‌గా షారూఖ్ ఖాన్ అవతారమెత్తుతాడు.

1977నాటి సినిమాలలో నటీనటులపై సెటైర్లు వదలిన ఓం శాంతి ఓం 2007 నాటి సన్నివేశాలలో సైతం 1977 నాటి పోకడలు పోవడం అలనాటి చిత్రీకరణ పద్ధతుల పట్ల దర్శకురాలు ఫర్హాఖాన్‌కు గల మమకారాన్ని వ్యక్తం చేస్తున్నదని బాలీవుడ్ పండితులు పెదవి విరుస్తున్నారు. బాలీవుడ్ బాద్షాకు గల సూపర్ స్టార్ ఇమేజ్‌ను సక్రమంగా వినియోగించుకోవడంలో దర్శకురాలు విఫలమైందని అంటున్నారు.

WD PhotoWD
ఇక సావరియా విషయానికొస్తే... సోనమ్ కపూర్‌పై రణ్‌బీర్ కపూర్‌‌పై కలిగే ప్రేమ, అలాగే సల్మాన్ ఖాన్‌పై సోనమ్ కపూర్ మనస్సు పారేసుకునే తీరును ఎస్టాబ్లిష్ చేయడంలో దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ విఫలమైనాడు. అంతేకాక చిత్రానికి కథంటూ లేకపోవడంతో ఇంకా సినిమా ఉందేమో అని ప్రేక్షకుడు భావిస్తున్న తరుణంలో సినిమా హఠాత్తుగా ముగిసిపోయి టైటిల్స్ కింద నుంచి పైకి పోతుండగా తాను చూసిందేమిటో అర్ధంకాని అయోమయ పరిస్థితిలో సగటు ప్రేక్షకుడు ఇంటి ముఖం పడతాడు.

భారీ అంచనాలతో విడుదలైన రెండు మెగా చిత్రాలు పేలని బాణసంచా వలె తుస్సుమనడం భారీ చిత్ర నిర్దేశకులు అతి ఆత్మవిశ్వాసానికి నిదర్శనమని సినీ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.
About Writer
WD