రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వారంరోజులపాటు జరిగిన 15వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం మంగళవారం రాత్రి గవర్నర్ ప్రసంగంతో పూర్తయ్యింది. సినిమాలు బాల బాలికలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు తోడ్పడాలని రాష్ట్ర గవర్నర్ నారాయణ్ తివారి కోరారు. తెలుగు లలిత కళాతోరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ... సినిమాలు బాలల్లో జాతీయ సమైక్యత, మతసామరస్యం పెంపొందించే విధంగా ఉండాలని సూచించారు.
అంటరానితనం, వరకట్నం లాంటి దురాచారాలను రూపుమాపేందుకు దోహదపడాలని అన్నారు. మహిళలపై వేధింపులు, వంచనలు వంటి దుర్మార్గాలను అరికట్టే విధంగా ప్రభావితం చేయాలన్నారు. చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా ఛైర్ పర్సన్ నఫాసా అలీ సోది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఈసారి ఇరానీ చిత్రాలు తక్కువగా ప్రదర్శించబడటంతో... ప్రతిసారి బహుమతులను గెలుచుకునే ఇరాన్ చిత్రాలకు ఈసారి బ్రేక్ పడింది. చైనా చిత్రం "ఇన్విజబుల్ వింగ్" చిత్రం బంగారు ఏనుగు బహుమతిని స్వంతం చేసుకుంది. అంతేకాకుండా ఈ చిత్రంలో నటించిన లీక్వింగ్ యావొ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు.
జ్యూరీ అవార్డును డెన్మార్క్ చిత్రం "మై ఐస్", ఇండియా చిత్రం "ఏక్ ఆదేశ్" చిత్రాలు సొంతం చేసుకున్నాయి. ఆసియన్ పనోరమ జ్యూరీ విభాగంలో వెండి ఏనుగును ఇండియా చిత్రం "విల్ టూవిన్", ఇరాన్ చిత్రం "వన్స్ ఎక్రో", శ్రీలంక చిత్రం "బటర్ ప్లయ్ వింగ్స్" గెలుచుకున్నాయి. ఇక బాలల జ్యూరీ అవార్డును ఫిలీప్పీన్ చిత్రం "మదర్ నాని" సొంతం చేసుకుంది. ఉత్తమ బాల నటుడిగా "కేరాఫ్ ఫుట్‌పాత్" హీరో, దర్శకుడు ఎస్.ఎస్. కిషన్ గెలుపొందాడు.
ఉత్తమ సంగీతానికి ఫ్రాన్స్ చిత్రం టార్జిక్ స్టోరీ విత్ హ్యాపీ ఎడిటింగ్, ఉత్తమ డైరక్టర్‌గా ఫిలిప్పీన్ మదర్‌నానీ డైరక్టర్ పాప్‌లో బిగ్ లాంగ్ అనా జూనియర్లు గెలుచుకున్నారు. బెస్ట్ యానిమేషన్ అవార్డు హంటింగ్ లైవ్ యాక్షన్‌షాట్ చిత్రంగా బావోకే, మదర్‌నానీ చిత్రాలకు దక్కింది. బంగారు ఏనుగు గెలుపొందిన వారికి రెండు లక్షలు, వెండి ఏనుగు అవార్డు గ్రహీతలకు లక్షరూపాయల బహుమతులను ఇస్తారు.