1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

చిరు రాజకీయాల్లోకి వస్తే సంతోషమే: విక్టరీ

చిరు రాజకీయాలు వస్తే సంతోషమే విక్టరీ
FileFILE
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారన్న వార్తలపై ఆయన అభిమానుల మాటెలా ఉన్నా ముఖ్యంగా ఇండస్ట్రీ నుంచి ఎటువంటి ప్రకటనలు వెలువడలేదు.. ఈ విషయమై ఎవర్ని కదిలించినా ఆచి తూచి స్పందిస్తున్నారు. ఇంకా ఆయన్నుంచి ఏ స్టేట్‌మెంట్ రాలేదనే అంటున్నారు. విక్టరీ వెంకటేష్ కూడా అదే రీతిలో స్పందిస్తున్నారు. రాజకీయాల గురించి ఆయన్ను సంప్రదిస్తే.. నాకు రాజకీయాలంటే ఏమిటో తెలియదు..

ఏదో ఇలా మంచి కథలు వస్తే సినిమాలు చేసుకుంటూ పోవడమే.. లేదంటే ఆధ్యాత్మికం వైపు మళ్లడమే అంటున్నారాయన.. చిరంజీవి విషయంపై అడుగగా, తోటి ఆర్టిస్టుగా అభినందిస్తాను.. అయితే ఎవరో ఒకరు రావాలి.. అయినా అసలైన వ్యక్తి నుంచి ఎలాంటి మాటలు రాకుండానే పత్రికలు రాసేస్తున్నాయని, వచ్చాకే స్పందించడం బాగుంటుందని వ్యాఖ్యాననించారు.

చిరంజీవి పార్టీ వెలుగులోకి వచ్చిందిలా...
మెగాస్టార్ రాజకీయాల్లోకి వస్తారన్న పుకార్లు కొన్నేళ్లుగా ప్రచారంలో ఉన్నాయి. ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు కొంత కాలంగా సమాలోచనలు జరుపుతున్నారన్న వార్తలు ఇప్పటి వరకూ ఊహాగానాలకే పరిమితం అయ్యాయి. నిజానికి 2009లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ పెడితే ఏ విధంగా ఉంటుందనే దానిపై చిరంజీవి కుటుంబ సభ్యులు తమకు ఉన్న అత్యంత సన్నిహితులతో ఇటీవలి కాలంలో మంతనాలు మొదలు పెట్టారు.

చిరంజీవి బావమరిది అల్లు అరవింద్, కాసు ప్రసాద్ రెడ్డి, చిరంజీవి సన్నిహితులు. ప్రసాద్ రెడ్డి ప్రముఖ డాక్టర్.. ఈయన హైదరాబాద్‌లో మ్యాక్స్ విజన్ అనే సంస్థను నడుపుతున్నారు. చిరంజీవి నడుపుతున్న ఐ, బ్లడ్ బ్యాంక్‌తో మ్యాక్స్ విజన్‌కు కొన్నేళ్లుగా సంబంధాలున్నాయి. ఈ చొరవతో అల్లు అరవింద్.. తదితరులు చిరంజీవి పార్టీ పెడితే ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలని ప్రసాద్ రెడ్డికి చూచాయగా చెప్పారు.

తనకు తెలిసిన నలుగురైదుగురు పాత్రికేయులతో ప్రసాద్ రెడ్డి ఈ విషయంపై రెండు మూడు రోజుల క్రితం ఇష్టాగోష్టిగా చర్చించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మాట్లాడుకున్నారు. ఈ భేటీయే చిరంజీవి పార్టీ పెట్టబోతున్నారన్న వార్తలకు ప్రధాన భూమిక.. ఈ వార్తలతో ఒక్కసారిగా అటు చిరంజీవి సన్నిహిత వర్గం.. ప్రభుత్వం, కొన్ని ప్రధాన పార్టీలు ఉలిక్కిపడ్డాయి.

సీఎం, ఆయన పేషీ అధికారులు ఇంటలిజెన్స్ ద్వారా సమాచారం తెలుసుకుని ప్రసాద్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. ఇటీవలనే మ్యాక్స్ విజన్‌లో వైఎస్ కంటి ఆపరేషన్ చేయించుకున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కాసు కృష్టా రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి చిరంజీవి పార్టీపై మీడియా ద్వారా అభిప్రాయసేకరణ చేయడం, మెగాస్టార్ సన్నిహితులకు పార్టీపై సూచనలు ఇవ్వడంపై సీఎం మండిపడినట్లు తెలిసింది.

కాంగ్రెస్ నేతలు కొందరు కాసు బ్రదర్స్‌తో రెండు రోజులుగా మాట్లాడుతున్నారని.. వారిలో వైఎస్ సన్నిహితులు సైతం ప్రసాద్‌రెడ్డిని దూరంగా ఉంచారని తెలిసింది. రెంటికీ చెడ్డ రేవడిలా ప్రసాద్ రెడ్డి పరిస్థితి ఉందని విశ్వసనీయ సమాచారు... ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలో ఉన్నారని మ్యాక్స్ విజన్ వర్గాలు పేర్కొంటున్నాయి.

చిరంజీవి సెంటిమెంట్
చిరంజీవి పార్టీ పేరుపై చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. పదిహేను పేర్లు పరిశీలనకు వచ్చినప్పటికీ చిరంజీవి పార్టీ అనే పేరు వైపునకు చిరు సన్నిహితులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.. చిరంజీవి ఆయన కుటుంబ సభ్యులకు ఉన్న ఆధ్యాత్మిక చింతన, సెంటిమెంట్ దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.. చిరంజీవి ఆంజనేయస్వామి భక్తుడు.. చిరంజీవి అనే పేరులో కలకాలం పార్టీ ఉండాలనే ఆకాంక్ష ప్రతిధ్వనిస్తుంటుంది.
అన్ని మతాలకు, కులాలకు సంబంధించిన పేరు.. దానితో పాటు ఎలాగూ మెగాస్టార్ పేరు కలిసి ఉంటుంది. కాసాని జ్ఞానేశ్వర్ ఇటీవల మన 'పార్టీ' అనే పేరుతో పార్టీ పెట్టారు. ఆ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మెగాస్టార్ పార్టీకి చిరంజీవి పార్టీ అనే పేరును చాలా మంది సూచిస్తున్నారు. అంతకంటే మంచి పేరు వస్తే దాన్నీ పరిశీలిస్తామని సన్నిహితులంటున్నట్లు భోగట్టా..

అభిప్రాయ సేకరణకు రెడీ..
మెగాస్టార్ పార్టీపై అభిప్రాయ సేకరణకు రంగం సిద్ధమైంది.. చిరంజీవి ఐ బ్లడ్ బ్యాంక్ నిర్వాహకుల్లో ఒక వ్యక్తి ఇప్పటికే సర్వే పత్రాల నమూనా రూపొందించి అభిమానులకు పంపారని వార్తలొచ్చాయి. కొన్ని డాట్ కామ్‌లు, ఒకటి రెండు టీవీ ఛానెళ్లలో చిరంజీవి పార్టీపై అభిప్రాయ సేకరణ చేయించడంపై చర్చలు జరుగుతున్నాయని ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఎస్ఎంఎస్, ఈ మెయిల్, ఆన్‌లైన్ తదితరాల ద్వారా అభిప్రాయ సేకరణ త్వరలో ప్రారంభమవుతుందని సమాచారం.

ప్రజాభిప్రాయం చిరుకు అనుకూలంగా వస్తే ఆ వివరాలను గ్రాఫ్‌లతో సహా మీడియాకు బహిర్గతపరిచే అంశం కూడా పరిశీలనలో ఉంది. కాగా, చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారన్న వార్తలపై ఆయన అభిమానులు అమితంగా స్పందిస్తున్నారు. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో చిరంజీవిని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తూ అభిమానులు బుధ, గురువారాల్లో ప్రదర్శనలు నిర్వహించారు.. విశాఖ, విజయవాడల్లో ప్రదర్శనలు బహిరంగ సభలకు ఆయన అభిమాన సంఘాలు పిలుపునిచ్చాయి.
About Writer
Hanumantha Reddy