1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

ఒక్కసినిమా తీస్తే... వందసార్లు చూస్తారు

రజనీకాంత్ సూపర్ స్టార్ తలయ్‌వార్ తమిళనాడు
WD
రజనీకాంత్ ఒక్క సినిమా తీస్తే.... దానిని ఒక్కో ప్రేక్షకుడు వందసార్లు చూస్తాడు... అందుకే రజనీ కోలీవుడ్ సూపర్ స్టార్. తమిళనాట 'తలయ్‌వార్' అని పిలిపించుకునే రజనీ పుట్టినరోజు నేడు. రజనీకాంత్ 1950 డిసెంబరు 12న కర్ణాటకలో జన్మించారు. ఆయన ఐదో ఏటనే తల్లి మరణించటంతో కష్టాలు మొదలయ్యాయి. అయినా వాటిని లెక్కచేయక చిన్ననాటినుంచే కష్టించి పనిచేయటం మొదలుపెట్టారు. కర్ణాటకలో అనేక చిన్నచిన్న ఉద్యోగాలు చేశాడు. సినీ పరిశ్రమలోకి రాక మునుపు ఆయన స్టేజి షోలలో నటించారు.

అదేసమయంలో బెంగుళారు ట్రాన్స్‌పోర్టు సర్వీస్‌లో బస్ కండక్టర్‌గా కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. ఆ తర్వాత మద్రాసు ఫిలిమ్ ఇనిస్టిట్యూట్ లో 1973న ప్రవేశించి యాక్టింగ్ కోర్సును సమర్థవంతంగా పూర్తి చేశారు. తొలి సినీ ఛాన్సు కన్నడంలో వచ్చినప్పటికీ తమిళంలో కె. బాలచందర్ దర్శకత్వంలో నటించిన 'అపూర్వ రాగంగళ్' ఆయన కెరీర్‌కు పునాది వేసింది. ఆ తర్వాత వరుసగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగారు రజనీ.

ప్రతి చిత్రంలోనూ తనదంటూ ఓ స్టయిల్‌ను క్రియేట్ చేసుకోవటానికి ప్రయత్నించి సఫలమవటమేకాక 'రజనీ స్టయిలే వేరు' అన్న కీర్తిని సాధించారు. తిరుమల తిరుపతి వెంకన్న సన్నిధిలో 1981 ఫిబ్రవరి 26న లతను వివాహమాడారు రజనీ. ఆయన ఇద్దరి కుమార్తెలలో పెద్దకుమార్తె ఐశ్వర్యను యువనటుడు ధనుష్‌కిచ్చి వివాహం చేశారు.

అంతకుముందు రాజకీయ ప్రవేశం గురించి ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ అయన వాటివైపు మొగ్గలేదు. ఎప్పటికప్పుడు తన నటనతో ప్రేక్షకులను ఉర్రూతలూగించే రజనీ స్టయిల్.. నటన అంటే నాటి తరానికే కాదు నేటి కుర్రకారుకి ఎంతో క్రేజ్. అందుకే 'రజనీ ఒక్క సినిమా చేస్తే ప్రేక్షకులు వందసార్లు చూస్తారు' అనటంలో ఎంతమాత్రం అతిశయోక్తి కాదేమో.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT