గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » అత్తిలి "తెలుగు మాస్టార్" గిన్నిస్ రికార్డు
కథనాలు
Feedback Print Bookmark and Share
 
తెలుగు చిత్ర సీమలో కామెడీ కింగ్‌గా పేరుగాంచిన 'హాస్యబ్రహ్మ' బ్రహ్మానందం. తాను చిత్రాల్లో పండించే హావ భావాలతో ప్రేక్షకులను గిలిగింతలు పెట్టి, కడుపుబ్బ నవ్వించే ఈ అత్తిలి కళాశాల తెలుగు మాస్టారు.. సరికొత్త రికార్డును సృష్టించారు. ఒకే భాషలో 754 చిత్రాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరును లిఖించుకున్నాడు. ఈ విషయాన్ని 'బ్రహ్మానందం డ్రామా కంపెనీ' చిత్ర షూటింగ్‌లో బ్రహ్మానందమే స్వయంగా వెల్లడించారు. అంతేకాకుండా.. తన పేరు గిన్నిస్ బుక్‌లో నమోదైనట్టు ఆ సంస్థ అధికారికంగా పంపిన లేఖను కూడా బ్రహ్మానందం విలేకరులకు చూపించారు.

తెలుగు మాస్టారు నుంచి వెండితెరకు...

అత్తిలి కళాశాలో తెలుగు మాస్టారుగా పని చేస్తూ హాయిగా జీవితం గడుపుతున్న బ్రహ్మానందాన్ని అలనాటి హాస్యబ్రహ్మ జంధ్యాల తెలుగు వెండితెరకు పరిచయం చేశారు. అలా.. 1985 సంవత్సరం ఫిబ్రవరి ఒకటో తేదీన తన సినీ జీవితాన్ని ప్రారంభించిన బ్రహ్మానందానికి.. జంధ్యాల రూపొందించిన ‘సత్యాగ్రహం’ తొలి చిత్రం. అయితే.. ఇవివి.సత్యనారాయణ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన 'అహనా పెళ్లంట' సినిమాలో "అరగుండు" బ్రహ్మానందం పాత్రతో ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది.

అక్కడ మొదలుకుని నేటి వరకు వెనుదిరిగి చూసిన ఛాయలు కనిపించలేదు. అవార్డులు, రికార్డులు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయే కానీ.. వాటి కోసం బ్రహ్మానందం ప్రాకులాడిన సంఘటనలు సినీ జీవితంలో ఎక్కడా మచ్చుకైనా కనిపించవు. సినిమా హిట్‌ కావాలంటే బ్రహ్మానందం కామెడీ తప్పనిసరి అన్న రేంజ్‌లో తన ఇమేజ్‌ను పెంచుకోవడమే కాకుండా.. హాస్యాన్ని పండించడంలో ఆరితేరిపోయారు. ఒక పక్క హాస్య నటుడిగా నటన కొనసాగిస్తూనే మరోపక్క తనలోని హీరో అదృష్టాన్ని పరీక్షించుకున్న నటుడు కూడా ఆయనే.

"లోఫర్ మామ.. సూపర్ అల్లుడు" చిత్రంలో బ్రహ్మానందం హీరోగా వెండితెరపై కనిపించారు. ఇలా.. తన జీవన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ.. గత 22 సంవత్సరాలుగా తెలుగు వెండితెరపై తిరుగులేని కామెడీ ఇమేజ్‌ను తన సొంతం చేసుకున్న నటుడు బ్రహ్మానందం. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బ్రహ్మానందానికి గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయగా... హాస్యనటుడు అల్లు రామలింగయ్య స్మారకార్థం ఏర్పాటు చేసిన "అల్లు అవార్డు"ను 2005లో ఈ నేటి హాస్యబ్రహ్మంను ఎంపిక చేసి, సత్కరించారు.