1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

నటశేఖర కృష్ణకు ''కళాప్రపూర్ణ'' పురస్కారం

నటశేఖర కృష్ణ కళాప్రపూర్ణ పురస్కారం సూపర్ స్టార్ ఆంధ్ర విశ్వవిద్యాలయం
WD PhotoWD
తెలుగు చలన చిత్ర సీమలో గ్లామరస్‌ నటుడు, నటశేఖరుడు, సూపర్ స్టార్ కృష్ణకు కళాప్రపూర్ణ పురస్కారం వరించింది. తెలుగు చలన చిత్ర సీమకు ఆయన చేసిన సేవకు గాను ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసి సత్కరించింది.

విశాఖపట్నంలో బుధవారం ఆంధ్రవిశ్వవిద్యాలయం ప్లాటినం జూబ్లీ స్నాతకోత్సవం సందర్భంగా సంస్థ వైస్‌ఛాన్సలర్ ఆచార్య ఎల్ వేణుగోపాల రెడ్డి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని కృష్ణకు ప్రదానం చేశారు. ఇప్పటి వరకు కృష్ణ 350 పైగా చిత్రాల్లో నటించగా... వీటిలో 70 చిత్రాలకు పైగా వివిధ భాషల్లో నిర్మాణ బాధ్యతలు నిర్వహించారు.

గతంలో కృష్ణ జేమ్స్‌బాండ్, కుటుంబ తరహా వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు అభిమాన నటుడయ్యారు. వైవిధ్యభరితమైన నటనకే పరిమితం కాకుండా కళామతల్లి సేవలో పునీతున్ని కావడమే తన జీవిత లక్ష్యమని ఈ ఆంధ్ర జేమ్స్‌బాండ్ నిరాడంబరంగా చెబుతారు. ఈ గౌరవం దక్కడం ఎంతో సంతోషాన్ని.. కలుగజేసిందని ఆయన తెలిపారు.

పురస్కారాన్ని స్వీకరించిన అనంతరం కృష్ణ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి చేసిన వ్యాఖ్యలు కేవలం అవగాహనా రహిత్యంతో కూడినవేనని ఆయన తెలిపారు. చిత్ర సీమలో ఎంతో మంది సినీ నటులు కళకే కాక సమాజ సేవకు కూడా ఎంతో పాటు పడ్డారని ఆయన గుర్తు చేశారు.

గతంలో ఇందిరగాంధి మరణం తనను కలవర పరిచిందని.. దీంతో రాజీవ్‌గాంధీ ఆశయాలకు అండగా నిలవాలన్న సదుద్ధేశంతో రాజకీయాల్లోకి ప్రవేశించానని తెలిపారు. అయితే రోజీవ్ మరణానంతరం ఆసక్తి కోల్పోయిన తాను రాజకీయాల నుంచి వైదొలిగానని ఆయన గత స్మృతులను గుర్తుకు చేసుకున్నారు.

తనయుడు మహేష్ బాబు గురించి మాట్లాడుతూ చలన చిత్ర రంగంలో సంచలనాలు సృష్టించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మంచి కథ దొరికితే మహేష్‌తో కలిసి నటించడానికి సిద్ధమేనన్నారు. అలాగే మహేష్ రికార్డులను తిరగరాస్తాడని ధీమా వ్యక్తం చేశారు.
About Writer
Hanumantha Reddy