1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

వినోదానికే పెద్ద పీట

వినోదానికే పెద్ద పీట ఇమేజ్‌ కథ ఫీల్ ప్రేక్షకుడు ఎంటర్‌టైన్‌మైంట్‌
సెంటిమెంట్లు, సందేశాలు, మెస్మరైజ్ చేసే ఫైట్లతో హీరోలు తన ఇమేజ్‌తో ఎన్ని జిమ్మిక్కులు చేసినా వాటితో పనిలేకుండా ప్రేక్షకుడు ఎంటర్‌టైన్‌మైంట్‌కే పట్టం కడతాడని సంక్రాంతి చిత్రాల సందడి వెల్లడిస్తోంది. ఇండస్ట్రీ పచ్చగా ఉండే వారంతా అనుకున్నారు. కానీ వారి అంచనాలను తారుమారు చేసి రవితేజ సంక్రాంతి హీరోగా నిలిచాడు. ద పవర్ ఆఫ్ ఇంద్రకీలాద్రి ఏంటో చూపించాడు.

కథలో ఫీల్ లోపించింది.
మంచి పాయింట్. స్వాతంత్ర్యం కోసం తన కుటుంబం ప్రాణాలర్పిస్తే తానూ పోరాడి కొంత కాలం అజ్ఞాతంలో ఉండి, కలలు కన్న తన స్వాతంత్ర్యం ఎలా ఉందో చూడాలనుకుని బయటకు వచ్చిన యోధుని కథ.

బాలకృష్ణ భారతీయుడు రేంజ్‌లో చూపాలనుకోవడం మంచి ఆలోచనే అయినా మక్కికి మక్కీ కాపీ చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది దర్శకుడు గ్రహించలేకపోయాడనుకోవడమూ పొరపాటే. కర్ణుని చావుకు లక్షకారణాలంటూ ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తిరస్కరించడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయి. ఏ సన్నివేశమూ ఆకట్టుకోలేక పోయింది. దేవదాసు చిత్రంలో ఇలియానా అందాలతో యూత్‌ను ఆకట్టుకున్నట్లు ఇందులో అనుష్క నిషాకొఠారీలతో ప్రయోగాన్ని చేసి ఏహ్యభావాన్ని కలిగించాడు.

నందమూరి వంశంలో హరికృష్ణతో రెండు సినిమాలు తీసి సక్సెస్‌లు ఇచ్చిన వైవిఎస్ చౌదరికి బాలకృష్ణతో అవకాశం దక్కింది. ఆయన స్వతహాగా నందమూరి అభిమాని గనుక సూపర్ డూపర్ హిట్ ఇస్తాడని అందరూ భావించారు. దానికి తగినట్లే హైబడ్జెట్‌తో నిర్మించారు. దాదాపు 18 కోట్లు ఖర్చయిందని తెలిసింది. కానీ వైవిఎస్ చౌదరి మాత్రం 25 కోట్లతో తీసినట్లు చెబుతున్నారు. బాలకృష్ణతో ద్విపాత్రాభినయం చేయించి నెంబర్ వన్ స్థాయిలో చూపిస్తాడని ఊహించిన ప్రేక్షకులకు, అభిమానులకు నిరాశే కలిగించింది. ఈ సినిమాను సీడెడ్ ఏరియాను డి సురేష్ బాబు, బళ్ళారి హరి ఇద్దరూ కలిసి 5.5 కోట్లు కొనుగోలు చేయగా దాదాపు 2.5 కోట్లు వస్తుందని, 3 కోట్లు నష్టం వాటిల్లుతుందని పరిశ్రమ వర్గాల అంచనా.

త్యాగాల ప్రేమ
ఇక మరో అంచనాతో ఎంఎస్ రాజు వాన విడుదలైంది. పోకిరి తరహాలో కన్నడంలో కలెక్షన్లు సృష్టించిన ముంగార మలైను తెలుగులో తీస్తుంటే అంతే రికార్డ్ సృష్టిస్తుందని చిత్ర సీమ భావించింది. ఎన్నో మెగాహిట్లు ఇచ్చిన ఎంఎస్ రాజు దర్శకుడిగా కూడా మారడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. అలాంటి సినిమా ప్రేక్షకుల్ని అలరించలేకపోయింది. నువ్వు నాకు నచ్చావ్, నువ్వే కావాలి వంటి చిత్రాలు ఎంగేజ్‌మెంట్ కథల్లో హీరోయిన్‌ని సైడ్‌ట్రాక్ పట్టించి ప్రేమను గెలుచుకోవటం అనే ప్రధాన అంశాన్ని తీసుకుని హీరో త్యాగం చేయడంతో ముగిస్తాడు. త్యాగాలు చేసిన ప్రేమికులకు మాత్రం ఈ సినిమా నచ్చుతుంది.

హాస్యమే ఆదుకుంది.
ఈ మధ్య కాలంలో వీవీవినాయక్ హిట్లు లేకపోవడంతో రవితేజతో "కృష్ణ" పవర్ ఆఫ్ ఇంద్రకీలాద్రి తీసి పర్వాలేదనిపించాడు. గత ఏడాది వినాయక్ యోగి తీసినా పెద్దగా ఫలితం రాలేదు. రవితేజకు దుబాయ్ శీను పర్వాలేదనిపించింది. ఇక నిర్మాతలుగా భగవాన్, దానయ్యలు కిందటేడాది దేశముదురు తీసి హిట్ తీసుకున్నారు. కొత్తగా వినాయక్ స్నేహితుడు బి కాశీవిశ్వనాధం నిర్మాతగా చేరాడు. కృష్ణ ఆదరణతో తొలి సినిమాతోను ఆయనకు ధైర్యం వచ్చింది. అవకాశముంటే మరో సినిమా వినాయక్‌తో తీస్తానని నిర్మాత ప్రకటించాడు. సంక్రాంతి సినిమాల్లో దీనికి పెద్దగా అంచనాలు లేకపోవడంతో అసలు ఎలా ఉంటుందో చూడాలని సగటు ప్రేక్షకుడు థియేటర్‌కు వెళ్లి రవితేజ శైలిలో ఉన్న కామెడీకి తోడు పూర్తి నిడివి గల బ్రహ్మానందం కామెడీని ఎంజాయ్ చేస్తున్నారు. ఒక రకంగా ఆ చిత్రాన్ని బ్రహ్మానందం తన భుజస్కందాలపై నడిపాడని చెప్పాలి. ఈ చిత్రాన్ని చూసిన అగ్రదర్శకులంతా బ్రహ్మానందంకు ఫోన్ చేసి చాలా బాగా చేశావ్. ఢీ తర్వాత మళ్లీ అంత రేంజ్‌లో నీ పాత్ర సినిమాకు ఉపయోగపడిందని చెబుతుంటే.. నాలో తెలీని ఉత్సాహం వచ్చిందని బ్రహ్మానందం స్వయంగా చెప్పారు.
About Writer
Hanumantha Reddy