వచ్చేసింది రిపబ్లిక్ డే.. చిరు పార్టీ ఎక్కడా...?
|
ముఖ్యంగా ఈ రోజు పలు చోట్ల షూటింగ్‌లు జరిగే ప్రాంతంలోను ఇదే చర్చ. ఇదిలా ఉంటే ఈ రోజు చిరు తన సన్నిహితులతో రోడ్‌నెంబర్ 25లోని తన ఇంట్లో సమావేశమయ్యారని వార్త గుప్పమంది. ఉదయం నుంచే కొద్దిగా హడావుడిగా ఉన్న ఈ రోడ్‌లో వెళ్లేవారిపై ఇంటలిజెన్స్ శాఖ ఎప్పటినుంచో దృష్టి సారించింది.
ఎవరు చిరు కుటుంబీకులో.. ఎవరు మఫ్టీలో ఉన్న ఇంటలిజెన్స్ వర్గాలో తెలీకుండా పోయింది. సినిమాల్లో చూపించినట్లుగానే తోపుడు బండ్లువారు ఆ రోడ్‌లోని అక్కడక్కడ కొత్తగా వెలుస్తుండటం చుట్టుప్రక్కల వారికి ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రెగ్యులర్‌గా ఆ రూటులో వెళ్లేవారికి ఇస్త్రీపెట్టె వాళ్లు, తోపుడు బండివాళ్లు అరుదుగా కనిపిస్తారు.
ఈ మధ్యకాలంలో రోడ్ టర్నింగ్‌లో చిన్నటీ దుకాణం కూడా వెలిసింది. ఇది ఎవరిది. పొట్టకూటి కోసం పెడుతున్నట్లు ఆ చుట్టుప్రక్కల ఇళ్లలో పనిచేసే వారు చెబుతున్నారు. ఆ రోడ్ చివర్లో చెన్నారెడ్డి మానవవనరుల కాలేజీ ఉండటంతో కాలేజీ పనినిమిత్తం వచ్చే వారి సంఖ్య కూడా ఎక్కువే.
ఏది ఎలా ఉన్నా.. చిరంజీవి రిపబ్లిక్‌డేనాడు పార్టీ ప్రకటన వెలువడటం అనేది లేదని తేలిపోయింది. చిరు సన్నిహితుల లెక్కల ప్రకారం మేలో పార్టీ ఏర్పాటుకు అనువైనదిగా పేర్కొంటున్నట్లు తెలిసింది. ఈ రోజు జరిగిన చర్చల్లో... ప్రధానంగా ఈ మధ్య వివాదస్పదంగా మారిన తెలంగాణా విషయంలోను ఆయన ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకున్నారు.
ప్రజల అభీష్టం మేరకే తాను శిరసావహిస్తానని కూడా గతంలో ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు కట్టుబడ్డారు. ఇటీవల కాలంలో టీఆర్‌ఎస్ నాయకులతో కూడా భేటీ జరిగింది. చిరంజీవికి టీఆర్ఎస్ నాయకులకు ఎన్నికల ఎత్తుగడలో అవగాహన కుదిరిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
మరోవైపు సీపీఎం రాష్ట్ర అధ్యక్షుడు బీవీ రాఘవుల్ని కూడా చిరంజీవి కలిసినట్లు సమాచారం. మొదటినుంచి కమ్యూనిస్టులంటే చిరుకు అభిమానమే. తన మామ అల్లురామలింగయ్య ఆ పార్టీకి చెందిన వారే. ప్రజానాట్యమండలి కళాకారుడిగా సినిమారంగంలోకి ప్రవేశించారు.
ఈ విషయాన్ని చాలా సార్లు చిరు కమ్యూనిస్టులకు తెలిపారు. మీ సహకారం లేకుండా నేను ముందుకు సాగడం కల్ల అనే విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలిసింది. మరో వైపు సినీ ఇండస్ట్రీ, ఎలాంటి భేషజాలు లేకుండా చిరంజీవికి సపోర్ట్‌గా నిలవాలని ఎప్పుడో నిర్ణయించాయి. త్వరలో మరిన్ని వివరాలు తెలియగలవు.