కష్టాల కడలిలో "ఒక్కమగాడు" పంపిణీదారులు
Publish: Mon, 28 Jan 2008 (21:20 IST)
Updated: Mon, 28 Jan 2008 (21:16 IST)
నందమూరి బాలకృష్ణ నటించిన "ఒక్కమగాడు" చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో పలువురుని నష్టాల్జేసింది. ముఖ్యంగా ఆ చిత్రాన్ని పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్లకు తీవ్ర నిరాశే మిగిల్చింది. దీంతో ఏకమైన కొంతమంది పంపణీదారులు నిర్మాత, దర్శకుడు వైవీఎస్.చౌదరి ఇంటి ముందు ధర్నాకు దిగారు. సోమవారం జరిగిన ఈ తంతుతో వైవీఎస్ నివాసం ఉండే ప్రాంతంలో వాతావరణం ఒక్కసారి వేడెక్కింది. ఈ చిత్రాన్ని పంపిణీ చేసినందుకు తమను తీవ్ర నష్టాలు పాల్జేసిందని, అందువల్ల కొంత వెసులుబాటు కల్పించాలని వారు వైవీఎస్‌ను వేడుకున్నారు. అయితే దీనిపై వైవీఎస్ తక్షణం స్పందించలేదు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ నటించిన "జానీ" చిత్రం ఇదే విధంగా ఫ్లాఫ్ కావడంతో పలువురు డిస్ట్రిబ్యూటర్లు నిర్మాత అల్లు అరవింద్ నివాసం ఎదుట ధర్నాకు దిగారు. దీంతో ఆయన కొంతమందికి కొంతమేరకు నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. ఆ తరహాలోనే తాజాగా నష్టపరిహారాన్ని ఇప్పించాలని డిస్ట్రిబ్యాటుర్లు కోరుతున్నారు.