1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

సినీ మేకింగ్ - మనీ మేకింగ్ : రావికొండలరావు

సినీ స్వర్ణోత్సవాలు రావి కొండలరావు పింగళి నాగేంద్ర
-రాజశేఖర
ప్రసిద్ధ సినీ విమర్శకులు రావికొండలరావు తెలుగు సినిమా స్వర్ణయుగపు రోజుల్లో జేగీయమానంగా వెలిగిన సినీ సంభాషణలను ఈ సదస్సులో సోదాహరణంగా ప్రస్తావిస్తూ, నేటి సినీ సంభాషణలను తూర్పారబట్టారు. పింగళి సముద్రాల వంటి నాటి సంభాషణా రచయితల కలాలనుంచి జాలువారిన తేట తెనుగు వినూత్న పదప్రయోగాలను ఆయన నిశితంగా పరామర్శించారు. స్వర్ణయుగాన్ని తేటతెలుగులో పచ్చకాలంగా అభివర్ణించిన ఆయన ఆ కాలంలో పింగళి నాగేంద్ర తెలుగు సినిమాల్లో పాత్రోచిత పదాల వాడకంలో సృష్టించిన కొత్త ప్రయోగాలను వివరించి ఆసక్తి కలిగించారు.

గిడిగిడి, డింభకా, శాయరా, గగ్గోలకా వంటి పదప్రయోగాలతో పింగళి ఆరోజు తెలుగు సినీ సాహిత్యానికి దిద్దిన కొత్త వరవడిని శక్తివంతంగా సదస్సు ముందుంచారు. మూస సంభాషణలను వల్లెవేయించడం బదులు కొత్తదనం ఇద్దాం అనే తలంపుతో నూతన పోకడలు పోయిన పింగళి తెలుగు సినిమాల్లో మాంత్రికుల పరిభాషను తీర్చిదిద్దిన మహావ్యక్తిగా రావికొండలరావు ప్రశంసించారు.

చందమామ చల్లగా మత్తుమందు చల్లగా, చందమామ చల్లగా పన్నీటి జల్లు జల్లగా అనే గుండమ్మకథ సినిమా పాటలో ప్రయోగించిన పదాల మహత్తును వివరించారు. కధానాయకుడికి చందమామ మత్తుమందు భావనను కలిగించగా, కధానాయకురాలికి చందమామ పన్నీటిజల్లుగా కనిపించేలా రూపొందిన ఈ పాట స్త్రీ పురుషుల దృష్టికోణాన్ని ఎంత మృదువుగా లలిత లలితంగా ఎత్తి చూపించిందో హత్తుకునేలా తెలిపారు.

ఇక నిర్మాతగా చక్రపాణి తెలుగు సినిమా సంభాషణను ఎంత క్లుప్తంగా, సరళంగా, ఉండాలో చూపించి ఒక ట్రెండ్‌ని సృష్టించారని సోదాహరణంగా చెప్పారు. చక్రపాణి గారు తీసిన షావుకారు, స్వర్గసీమ సినిమాలు చిన్న చిన్న తేలికపాటి సంభాషణలకు, వాక్యాలకు నిదర్శనాలుగా నిలుస్తాయని, చిన్న ముక్క డైలాగ్‌తో సన్నివేశాన్ని ఎంతగా రక్తి కట్టించవచ్చో ఈ రెండు సినిమాలు శక్తివంతంగా ప్రదర్శించాయని తెలిపారు.

1950-75 పచ్చకాలంలో సాహిత్యపు విలువలను కాపాడుకుంటూ వచ్చిన సినిమా రచన అధోగతి పాలయిందని రావికొండల రావు తీవ్రంగా విమర్శించారు. ఫిలిం మేకింగ్ అనే భావన పోయి మనీ మేకింగ్ వచ్చేసిన పాడుకాలమిది అంటూ ప్రస్తుత సినీ నిర్మాణ ధోరణులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. బూతు రాస్తే హాస్యం, డబుల్ మీనింగ్ రాస్తేనే హాస్యం అయిపోయిన ప్రస్తుత కాలం తెలుగు సినీ సాహిత్యానికి పాడుకాలంగా ఆయన అభివర్ణించారు. ప్రస్తుతం టీవిల్లో వచ్చే ఒక క్లిప్పింగ్ చూస్తే చాలు సినిమా ఎంత దరిద్రంగా ఉంటుందో అర్థమయిపోయేంత దరిద్రంగా సినిమాలు ఉంటున్నాయని తూర్పారబట్టారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT