1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

దైవభక్తి - దేశభక్తి - దేహభక్తి

తెలుగు సినిమా సాహిత్యం అశ్లీలం కృష్ణ సినీ చరిత్ర
- రాజశేఖర్
తెలుగు సినిమా సాహిత్యపు 75 సంవత్సరాల చరిత్రను దైవభక్తి, దేశభక్తి, దేహభక్తి పరిణామ చరిత్రగా సీనియర్ జర్నలిస్టు బిఎస్సార్ కృష్ణ అబివర్ణించారు. తొలినాటి తెలుగు సినిమా దైవభక్తి ప్రధానమైన సినిమాలతో -భక్తప్రహ్లాద వంటివి- మొదలుకాగా జాతీయోద్యమ ప్రభావ ఫలితంగా దేశభక్తి, సంస్కరణాభిలాషను తదుపరి సినిమాలు ప్రదర్శించాయని, ఇప్పుడు మాత్రం అంగాంగాలను ప్రదర్శించే దేహభక్తి ధోరణికి తెలుగు సినిమా అగ్రపీఠం వేస్తున్నదని ఆయన పేర్కొన్నారు. సినీ సాహిత్యం తెలుగు సాహిత్యంలో ఓ భాగమే తప్ప విడిగా అస్తిత్వంలో ఉండదని అభిప్రాయపడ్డారు.

మొదటి నుంచి తెలుగు సాహిత్యం తెలుగు సాంఘిక పరిణామంలో, సామాజిక పరిణామంలో భాగంగా ఎదుగుతూ వచ్చిందని పేర్కొన్న బిఎస్సార్ సమాజ ఉత్థాన పతనాల చరిత్రే సినీ సాహిత్య ఔన్నత్య, పతనాల చరిత్రగా పరిణమించిందని పేర్కొన్నారు. జాతీయ భావాలు, అభ్యుదయ భావాలు, ఉన్నతాదర్శాలు సమాజంలో, రాజకీయ రంగంలో రాజ్యమేలినంతకాలం తెలుగు సినిమా సైతం వాటిని ఎత్తిపట్టిందని, ఎప్పుడయితే ఆ ఉన్నతాదర్శాలకు సమాజంలోనూ, రాజకీయాల్లోనూ గండి పడిందో తెలుగు సినిమా సాహిత్యం కూడా అప్పుడే అధోగతి పాలయిందని ఆయన తెలిపారు.

ప్రస్తుతం సినీ సాహిత్యంలో అధోగతికి సమాజ, రాజకీయ రంగ అధోగతే కారణమని చెప్పిన కృష్ణ పాత సినిమాల్లో మాత్రమే విలువలు ఉండేవి అనటం భావ్యం కాదన్నారు. 1930ల లోనే తెలుగు సినీ పితామహుడు ఎల్వీ ప్రసాద్ తీసిన ఘరానాదొంగ సినిమాలో ఒక పాత్రచేత దొంగనాయాలా అని తిట్టించారని, పాత్రోచితం అని పేరు పెట్టుకున్నా సరే, అశ్లీలత అనేది ఎంతో కొంత పాత సినిమాలలోనే మొదలైందని ఆయన ఎత్తి చూపారు.అందుకే కాలాన్ని బట్టే, సంఘాన్ని బట్టే సినిమాలయినా, సాహిత్యమైనా రూపొందుతూ వస్తాయి తప్ప విలువలు పడిపోయాయంటే తాను ఒప్పుకోలేనని, విలువలు మారుతున్నాయనేదే తన అభిప్రాయమని ఆయన తెలిపారు.

ఆనాటి సినిమాలు భావ ప్రధానమైతే, నేటి సినిమాలు శబ్ద ప్రాధాన్యతతో నడుస్తున్నాయని, సినిమాలను విశేషంగా ఆదరించే కుర్రాళ్లు రణగొణధ్వనులనే ఎక్కువగా ఇష్టపడుతుండడంతో అలాంటి సినిమాలే వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. వ్యక్తిగతంగా తాను శంకరాభరణం, మల్లీశ్వరి సినిమాలను ఇష్టపడతానని తెలిపిన బిఎస్సార్ రాసినవాడిది ఎవరూ వినకపోతే, చదవకపోతే, ఆదరించకపోతే మళ్లీ మళ్లీ అలాగే ఎవరూ రాయలేరని, ఇది మంచికి, చెడుకు రెండింటికీ వర్తిస్తుందని అభిప్రాయపడ్డారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT