మూడు దశాబ్దాల ''మెగాస్టార్'' సినీ ప్రస్థానం
|
ఇలాంటి అరుదైన లక్షణాలు వున్న చిత్ర పరిశ్రమలో చాలా అరుదుగా కనిపిస్తారు. అలాంటి వారి జాబితాలో కొణిదెల శివశంకర వర ప్రసాద్ అలియాస్ మెగాస్టార్ చిరంజీవిని చేర్చడంలో అతిశయోక్తి కాదు. తనకు అత్యంత ప్రీతిపాత్రమైన సినీ రంగంలో కాలుమోపేందుకు ఆదిలోనే ప్రత్యేక శిక్షణ పొందాడు. వేషాల కోసం చెన్నపురి పట్టణంలో చెప్పులరిగేలా తిరిగాడు. అలా.. తెలుగు చిత్ర పరిశ్రమలో తన నటనకు "పునాది రాళ్ళ"తో పునాది వేసుకున్న మెగా 'మాస్టారు' చివరకు 'విజేత'గా నిలిచాడు. చిరంజీవి ముఖానికి రంగు వేసుకుని నేటికి ( ఫిబ్రవరి 11వ తేదీకి) సరిగ్గా ముఫ్పై సంవత్సరాలు.
"పునాదిరాళ్ళ"తో శ్రీకారం...
అది 1978 సంవత్సరం ఫిబ్రవరి 11వ తేది. 'స్వయంకృషి'నే నమ్ముకుని చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన రోజు. ఆ రోజే.. తన తొలి చిత్రం 'పునాది రాళ్లు' చిత్రం కోసం ముఖానికి రంగు వేసుకున్నారు. అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం విడుదలలో జాప్యం. ఒకింత నిరాశ. తొలి చిత్రం విడుదల కాలేదన్న నిస్పృహ. అయితేనే కుంగిపోలేదు. రెండో చిత్రం 'ప్రాణం ఖరీదు'. అదే ఏడాది సెప్టెంబరు 22వ తేదీన విడుదలైంది. మంచి సక్సెస్‌నే సాధించింది. వెండితెరపై కొత్త కుర్రాడు బాగానే చేశాడన్న ప్రశంసలు వచ్చాయి. అలా ఆరంభమైన చిరంజీవి సినీయాత్ర రెండు దశాబ్దాల పాటు చిత్ర రంగాన్ని ఏలి తెలుగు వెండితెరపై 'మెగాస్టార్'గా అవతరించాడు.
|
యాక్షన్ హీరోగా గుర్తింపు...
1981లో విడుదలైన 'చట్టానికి కళ్లులేవు' చిత్రం చిరుని యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చిపెట్టింది. 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' చిత్రం ఒక ఏడాది పాటు ప్రదర్శితమైంది. అప్పటి వరకు వచ్చిన చిత్ర కథలు, కథనాలు ఆర్ట్ సినిమాలుగా వుండేవి. అలాంటి సమయంలో తన నటనా వైవిధ్యంతో కథానాయకుడి స్వరూప స్వభావాలను మార్చి వేసిన ధీరోధాత్తుడు. ఎన్నో చిత్రాలు చేసినా ఒక్కసారిగా హాలీవుడో స్థాయిలో తెలుగుసినిమా సత్తాను చూపించిన ఘనత "ఖైదీ" చిత్రానికి దక్కింది. ఈ చిత్రంలో నటించే సువర్ణావకాశం ఇప్పించింది సూపర్‌స్టార్ కృష్ణ. ఆయన నటించాల్సిన వున్న తరుణంలో బిజీ షెడ్యూల్ కారణంగా ఆ అవకాశం చిరంజీవిని వరించింది.
దశాబ్దకాలం నిలబెట్టిన చిత్రం "ఖైదీ"..
"ఖైదీ" సంచలన విజయంతో చిరంజీవి ఓ దశాబ్ద కాలం పాటు వెనుదిరిగి చూడలేదు. ఆ తర్వాత రెండో అంకంలో వచ్చిన చిత్రం "మంత్రిగారి వియ్యంకుడు'. ఆ చిత్రం మొదలుకుని "స్వయంకృషి", 'గ్యాంగ్ లీడర్', 'ఘరానామొగుడు', 'ఇంద్ర', 'ఠాగూర్', 'శంకర్‌దాదా..' వరకు అన్ని హిట్ చిత్రాలే. ఈ మధ్యకాలంలో ఉత్తమనటుడు, నర్గీస్ దత్ జాతీయ పురస్కారం, పద్మభూషణ్ వంటివి చిరును వరించాయి. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో తన పేరును సుస్థిరం చేసుకున్న చిరంజీవి కోట్లాది మంది సినీ అభిమానులతో పాటు.. తెలుగు ప్రజల అభిమానాన్నిసొంతం చేసుకున్న ఏకైక హీరో ఈ శంకర్‌దాదా.