నేడు అమరగాయకుని వర్థంతి...
|
"పాడుతా, తీయగా చల్లగా ... పసిపాపలా నిదురపో తల్లిగా ... బంగారు తల్లిగా" అంటూ జోలపాట పాడినా "మనసు గతి ఇంతే.. మనిషి గతి ఇంతే.. మనసున్న మనిషికి సుఖము లేదంతే.." అని విషాద గీతం ఆలపించినా .."వగల లాడివి నీవే.. వయసుగాడను నేనే... ఈడుకుదిరెను.. జోడు కుదిరెను మేడ దిగిరావే.".. అంటూ ఉషారైన పాటతో ఉర్రూతలూగించినా... ఘంటశాలకు ఘంటశాలే సాటి... వేరెవరూ లేరు పోటీ.
ఎక్కడ పాట కచేరీ జరిగినా..ఘంటశాల పాట వినిపించి తీరుతుంది. ఆయన పాట పాడనిదే గాయకులకు మనసు కుదుటపడదు. ఆయన్ని అనుకరించనిదే వారి గళాల ఆర్తి తీరదు. తన స్వర గాంభీర్యంతో తరతరాలుగా శ్రోతలను తన్మయులను చేస్తున్న అమరగాయకుడు ఘంటశాల వెంకటేశ్వరరావు. ఘంటశాల స్వగ్రామం కృష్ణా జిల్లా టేకుపల్లి. తన 11వ ఏట వరకు ఆయన ఇక్కడే ఉన్నారు. తర్వాత సంగీత సాధన చేస్తూ మద్రాసుకు చేరారు.
టేకుపల్లిలో ఆయన గృహం శిధిలావస్థకు చేరింది. ఘంటశాల గాత్రం, అమృత తుల్యమని వేనోళ్ళ పొగడడమే గానీ, ఆయన స్వగ్రామానికి ఎవరూ చేసింది ఏమీ లేదు. ఆయన మనవరాళ్ళు, బంధువులూ ఇక్కడే సంగీత పాఠాలు చెప్పుకుంటూ, కాలం వెళ్ళదీస్తున్నారు. ఘంటశాల మనవరాళ్ళు ఘంటశాల మధుమతి, పార్వతి నాగ మల్లేశ్వరి చల్లపల్లి ఘంటశాల గ్రామంలోనే ఉంటున్నారు. నాగమల్లేశ్వరి, ఘంటశాల మేనల్లుడు చంద్రశేఖర్ స్థానికంగా కొందరు పిల్లలకు సంగీతం నేర్పుతున్నారు. ఘంటశాల స్వగ్రామం టేకుపల్లిలో ఆయన స్మారకంగా ఎటువంటి కట్టడమూ, నిర్మాణమూ లేదు.
కనీసం ఆడిటోరియం గానీ, సంగీత శిక్షణకు భవనం గానీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అందులో విద్యార్ధులకు ఉచితంగా సంగీతం నేర్పుతానని ఘంటశాల మనవరాలు పార్వతీనాగ మల్లేశ్వరి పేర్కొంటున్నారు. ఘంటశాల అభిమానులు ఘంటశాల గ్రామంలో ఓ కళాతోరణాన్ని నిర్మించారు. ఘంటశాల విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ గ్రామ పెద్ద జి.రామకృష్ణ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్నారు.
ఘంటశాలను విశేషంగా అభిమానించే కూచిపూడి సుబ్రహ్మణ్యం తన కార్పోరేట్ పీపుల్ సంస్థ ఆధ్వర్యంలో ఘంటశాల పాట కచేరిలు ఏర్పాటు చేస్తున్నారు. దీనికితోడు ప్రభుత్వం స్పందించి ఆయన స్మారకంగా సంగీత కళాశాలను టేకుపల్లి , చల్లపల్లి ప్రాంతాలలో నిర్మించాల్సి ఉంది. అదే ఆ అమర గాయకుడికి నిజమైన నివాళి.