1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

ఆ సంగతి తర్వాత చూద్దాం.. చిరు

ఓ వైపు జల్సాగా
FileFILE
ఓ వైపు జల్సాగా "జల్సా" ఆడియో వేడుకలు. మరో వైపు సీఎం జిందాబాద్ అంటూ అభిమానుల నినాదాలు. వేదికపై నిలబడి మాట్లాడుతున్న అతిథుల ప్రసంగాలు ఏ ఒక్కరి చెవికి ఎక్కడం లేదు. కారణం అభిమానుల గోల. తమ అభిమాన నటుడు రాజకీయ రంగ ప్రవేశం చేయాలని, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని ఇలా కలలు కంటూ.. ఆ ప్రాంతమంతా నినాదాల హోరుతో మార్మోగి పోతోంది. అయితే ఆ ముఖ్య అతిథి నుంచి మాత్రం ఒకటే సమాధానం. ఇంకా ఆ సమయం ఆసన్నం కాలేదు. ఆ సంగతి తర్వాత మాట్లాడుకుందాం. చూద్దాం. అంటూ అభిమానుల ఉద్దేశించి ముక్తాయింపు.

ఇంతకీ ఈ సంఘటన చోటు చేసుకుంది ఎక్కడో తెలుసా.! నిర్మాత అల్లు అరవింద్ సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌పై నిర్మించిన చిత్రం "జల్సా" ఆడియో కార్యక్రమంలో. దర్శకుడు త్రివిక్రమ్‌తో పాటు.. హీరో పవన్ కళ్యాణ్‌కు భవిష్యత్‌ను తేల్చే సినిమా. ఎన్నో నెలలుగా విజయం కోసం వేసి చూస్తున్న పవన్ కళ్యాణ్ ఈ చిత్రంపై భారీ ఆశలే పెట్టుకుని ఉన్నారు. అందుకే అత్యంత ప్రతిష్టాత్మకంగా నాటి "ఖుషీ" తరహాలో ఈ చిత్రాన్ని నిర్మించినట్టు ఫిల్మ వర్గాల సమాచారం.

ఈ చిత్రం ఆడియో క్యాసెట్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఆడియోను కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ రావాల్సి వుండగా, అనివార్య కారణాల వల్ల హాజరుకాలేదు. దీంతో.. మెగాస్టార్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆడియోను ఆవిష్కరించారు. తొలి క్యాసెట్‌ను తన సుపుత్రుడు "చిరుత"కు అందజేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ అల్లు అరవింద్ నిర్మాణ సంస్థలో నేను ఎన్నో చిత్రాల్లో నటించాను. కానీ ఎన్నడూ కూడా ఇంత జల్సాగా డబ్బులు ఖర్చుపెట్టి ఆడియోను ఆవిష్కరించిన సందర్భాలు లేవు.

ఈ కార్యక్రమం ఇంత ఆర్భాటంగా జరుగుతుందని నేను అసలు ఊహించలేదు. సహజంగా అల్లు అరవింద్ జేబులో నుంచి పైసలు తీయరు. కానీ ఈ రోజు మాత్రం ఇంతగా ఖర్చు చేశారంటే నేను నమ్మలేక పోతున్నాను. బహుశా అరవింద్ మూడో కుమారుడు శిరీష్ కోరిక మేరకు ఈ హంగామా చేసి వుండొచ్చు. ప్రస్తుతం నవతరం వచ్చేసింది. మా చరణ్, అర్జున్, శిరీష్. వాళ్ళ సారథ్యంలో మేం వెళ్లాలి. బిడ్డలు ఎదిగి ప్రయోజనకారులైనందుకు తల్లిదండ్రులు సంతోష పడాలి. ఇలాంటి దశలో మేం ఉన్నాం. ఇకపోతే తన తదుపరి చిత్రం "అధినాయకుడు" చేస్తానో చేయనో తర్వాత చూద్దాం. ఆ విషయాలు తర్వాత ప్రస్తావించుకుందామన్నారు.

సీఎం జిందాబాద్...
సీఎం జిందాబాద్ అంటూ కార్యక్రమానికి హాజరైన అభిమానుల నుంచి నినాదాలు. వెంటనే చిరు కలుగజేసుకుని అటు వైపు నుంచి ఏవో అరుపులు, నినాదాలు వినిపిస్తున్నాయి. అవేమి వినిపించడంలేదన్నారు. ఇంతలో అల్లు అరవింద్ కలుగజేసుకుని అసలు విషయం చిరు చెవిన వేశారు. రాజకీయమా ఆ సంగతి తర్వాత చూద్దాం. ప్రస్తుంతం అందరం కలిసి "జల్సా" చేసుకుందాం అంటూ ముగించారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT