1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

శోభన్ కుటుంబ నేపధ్యం...

మూడు దశాబ్దాల పాటు తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో మెరిసిన శోభన్‌బాబు విలక్షణ
సోలో హీరోగా మూడు దశాబ్దాల పాటు తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో మెరిసిన శోభన్‌బాబు విలక్షణ నటుడిగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. ఆయన సమకాలీకులు పలువురు ఇంకా సినిమాలలో, బుల్లితెరపై నటిస్తూ ఉన్నప్పటికీ స్వచ్చందంగా తెలుగు సినీ పరిశ్రమనుంచి నెమ్మదిగా తప్పుకున్న విలక్షణ వ్యక్తిత్వం శోభన్‌బాబుకే దక్కింది.

సినిమాలలోంచే కాదు.. చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఆడియో రిలీజ్, చిత్రాల విడుదల లేదా నంది అవార్డు తరహా ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగా ఉన్నారు. చిత్ర పరిశ్రమ నుంచి తప్పుకున్న మరుక్షణం నుంచి తాను సాధారణ జీవితమే గడుపుతానని ప్రకటించిన శోభన్‌బాబు చివరివరకూ మాట నిలబెట్టుకున్నారు.

ఆయన పూర్తి పేరు ఉప్పు శోభనాచలపతి రావు. 1937 జనవరి 14న కృష్ణా జిల్లా నందిగ్రామంలో ఉప్పు సూర్యనారాయణ దంపతులకు జన్మించిన శోభన్‌బాబుకు ముగ్గురు సోదరిలు -ధనరంగ, ఝాన్షీ, నిర్మల- ఒక సోదరుడు -సాంబశివరావు- ఉన్నారు.

కుంటముక్కల మైలవరంలో పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, విజయవాడలో డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత మద్రాసులో న్యాయ శాస్త్ర విద్యలో చేరారు కాని పూర్తి చేయలేదు. 1958 మే 15న కాంతాకుమారిని వివాహమాడిన శోభన్‌బాబుకు కరుణ శేషు అనే పుత్రుడు, మృదుల, ప్రశాంతి, నివేదిత అనే ముగ్గురు పుత్రికలు ఉన్నారు.

అయితే తాను సినీ రంగులు ప్రపంచంలో ఉన్నప్పటికీ ఆ జిలుగు వెలుగులను తన సంతానం మీద సోకనీయలేదు. తాత, తండ్రి, పుత్రుడు, మనవడు, మునిమనవడు ఇలా వారసత్వ నటకులు పుంఖానుపుంఖాలుగా బయలుదేరి ఉద్ధరిస్తున్న తెలుగు సినీ చిత్రపరిశ్రమలో శోభన్‌బాబు తన సంతానాన్ని కాని, సోదరీ సోదరులను కాని, ఇతర బంధువులను కాని సినీ పరిశ్రమ వైపు తొంగి చూడనీయలేదు.
About Writer
Raju