గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » నటభూషణుడి సినీ రంగప్రవేశం
కథనాలు
Feedback Print Bookmark and Share
 
వసంత కుమార్ రెడ్డి దర్శకత్వం వహించిన దైవబలం సినిమాతో శోభన్‌బాబు చిత్ర పరిశ్రమలో కాలు పెట్టారు. అయితే ఆయన నటించగా తెరపై విడుదలైన తొలి సినిమాగా భక్త శబరి రికార్డు కెక్కింది. కాగా అద్వితీయ నాట్యమయూరి ఎల్ విజయలక్ష్మి ఆయన సరసన తొలి హీరోయిన్‌గా నటించింది. ఇలా తొలిసారి విడుదలైన భక్తశబరి చిత్ర దర్శకుడు చిత్రపు నారాయణ మూర్తి. శోభన్ బాబు మొదటి చిత్రానికి సంగీత దర్శకత్వం వహించినవారు పెండ్యాల నాగేశ్వరరావు.

దైవబలం సినిమాతో తెలుగు సినీరంగంలో అడుగుపెట్టిన శోభన్‌బాబు తర్వాత అలనాటి అగ్రనటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌ల సినిమాలలో చిన్న చిన్ని పాత్రలు ధరించారు. మాయాబజారు, నర్తనశాల వంటి పౌరాణిక చిత్రాల్లో ఆయన నటన, అంతకు మించి ఆహార్యం ఈనాటికీ ప్రేక్షకుల హృదయాల్లో ముద్రించుకుపోయింది. సోలో హీరోగా ఆయన నటించిన తొలిచిత్రం 'వీరాభిమన్యు' (1965) పెద్ద విజయాన్ని సాధించినప్పటికీ కుటుంబంకోసం చిన్నాచితకా పాత్రలు ధరించక తప్పింది కాదు. తర్వాత 'మనుషులు మారాలి' చిత్రం మరింత పెద్ద విజయం సాధించడంతో అప్పటినుంచి సోలో హీరోగా మాత్రమే నటస్తూ వచ్చారు. 1997లో 'అడవిదొర' సినిమాతో ఆయన చిత్రజీవితానికి తెరపడింది.

శోభన్‌బాబు నట జీవితంలో కలికితురాయిగా మెరిసిన చిత్రాలన్నో ఉన్నా మనుషులు మారాలి చిత్రం ఆయన చిత్ర జీవితంలో మరపురాని విజయాన్ని అందించింది. ఆరోజుల్లోనే 25 వారాలు ఏకధాటిగా ప్రదర్శించిన ఈ చిత్రం శోభన్‌బాబుకు, హీరోయిన్ శారదకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

శోభన్‌బాబు చిత్రసీమలో అడుగు పెట్టేనాటికి బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు రాజ్యమేలుతున్నాయి. కన్నవారి కలలు చిత్రం ఆయన నటించిన తొలి రంగుల చిత్రం. రాముడు-పరశురాముడు చిత్రానికి గాను షూటింగ్ కోసం ఆయన మొట్టమొదటిసారిగా విదేశాలకు వెళ్లారు. ఆయన ద్విపాత్రాభినయం చేసిన తొలి చిత్రం పొట్టి ప్లీడర్.

తన కాలంలో స్టైలిష్ స్టార్‌గా మెరిసిన ఏకైక హీరో శోభన్‌బాబు అంటే అతిశయోక్తి కాదు. సూట్ ధరించినప్పటికీ పైన టీషర్ట్ ధరించే శోభన్‌బాబు లక్షలాది తెలుగు మహిళల హృదయాల్లో సుందర హీరోగా నిలిచిపోయారు. కళ్లద్దాలను అందులోనూ పెద్ద కళ్లద్దాలను శోభన్‌బాబు వాడితే ఆ కళ్లద్దాలకే వన్నె తెచ్చేది.