1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

నటభూషణుడి సినీ రంగప్రవేశం

రెడ్డి దర్శకత్వం వహించిన దైవబలం సినిమాతో శోభన్‌బాబు చిత్ర పరిశ్రమలో కాలు పెట్టారు. అయితే
వసంత కుమార్ రెడ్డి దర్శకత్వం వహించిన దైవబలం సినిమాతో శోభన్‌బాబు చిత్ర పరిశ్రమలో కాలు పెట్టారు. అయితే ఆయన నటించగా తెరపై విడుదలైన తొలి సినిమాగా భక్త శబరి రికార్డు కెక్కింది. కాగా అద్వితీయ నాట్యమయూరి ఎల్ విజయలక్ష్మి ఆయన సరసన తొలి హీరోయిన్‌గా నటించింది. ఇలా తొలిసారి విడుదలైన భక్తశబరి చిత్ర దర్శకుడు చిత్రపు నారాయణ మూర్తి. శోభన్ బాబు మొదటి చిత్రానికి సంగీత దర్శకత్వం వహించినవారు పెండ్యాల నాగేశ్వరరావు.

దైవబలం సినిమాతో తెలుగు సినీరంగంలో అడుగుపెట్టిన శోభన్‌బాబు తర్వాత అలనాటి అగ్రనటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌ల సినిమాలలో చిన్న చిన్ని పాత్రలు ధరించారు. మాయాబజారు, నర్తనశాల వంటి పౌరాణిక చిత్రాల్లో ఆయన నటన, అంతకు మించి ఆహార్యం ఈనాటికీ ప్రేక్షకుల హృదయాల్లో ముద్రించుకుపోయింది. సోలో హీరోగా ఆయన నటించిన తొలిచిత్రం 'వీరాభిమన్యు' (1965) పెద్ద విజయాన్ని సాధించినప్పటికీ కుటుంబంకోసం చిన్నాచితకా పాత్రలు ధరించక తప్పింది కాదు. తర్వాత 'మనుషులు మారాలి' చిత్రం మరింత పెద్ద విజయం సాధించడంతో అప్పటినుంచి సోలో హీరోగా మాత్రమే నటస్తూ వచ్చారు. 1997లో 'అడవిదొర' సినిమాతో ఆయన చిత్రజీవితానికి తెరపడింది.

శోభన్‌బాబు నట జీవితంలో కలికితురాయిగా మెరిసిన చిత్రాలన్నో ఉన్నా మనుషులు మారాలి చిత్రం ఆయన చిత్ర జీవితంలో మరపురాని విజయాన్ని అందించింది. ఆరోజుల్లోనే 25 వారాలు ఏకధాటిగా ప్రదర్శించిన ఈ చిత్రం శోభన్‌బాబుకు, హీరోయిన్ శారదకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

శోభన్‌బాబు చిత్రసీమలో అడుగు పెట్టేనాటికి బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు రాజ్యమేలుతున్నాయి. కన్నవారి కలలు చిత్రం ఆయన నటించిన తొలి రంగుల చిత్రం. రాముడు-పరశురాముడు చిత్రానికి గాను షూటింగ్ కోసం ఆయన మొట్టమొదటిసారిగా విదేశాలకు వెళ్లారు. ఆయన ద్విపాత్రాభినయం చేసిన తొలి చిత్రం పొట్టి ప్లీడర్.

తన కాలంలో స్టైలిష్ స్టార్‌గా మెరిసిన ఏకైక హీరో శోభన్‌బాబు అంటే అతిశయోక్తి కాదు. సూట్ ధరించినప్పటికీ పైన టీషర్ట్ ధరించే శోభన్‌బాబు లక్షలాది తెలుగు మహిళల హృదయాల్లో సుందర హీరోగా నిలిచిపోయారు. కళ్లద్దాలను అందులోనూ పెద్ద కళ్లద్దాలను శోభన్‌బాబు వాడితే ఆ కళ్లద్దాలకే వన్నె తెచ్చేది.
శోభన్‌బాబు నట జీవితంలో ఫిలింఫేర్ అవార్డులను నాలుగుసార్లు, నంది అవార్డులను అయిదుసార్లు దక్కించుకున్నారు. కాగా ఎపి సినీ గోయర్స్ అవార్డ్‌ను ఎనిమిది సార్లు గెల్చుకున్న శోభన్‌బాబు 1970 నుంచి 75 దాకా వరుసగా ఆరేళ్లపాటు ఆ ఆవార్డును తానే కైవసం చేసుకున్నారు. అలాగే మద్రాసు ఫిలిం ఫ్యాన్స్ అవార్డును 9 సార్లు గెలుచుకున్నారు. వంశీ బర్క్‌లీ అవార్డు, ఎపి ఫిలిం ఫ్యాన్స్ అవార్డ, ఆంధ్ర పత్రిక అవార్డ్, ఫిల్మ్ వరల్డ్ అవార్డ్ ఇలా ఆయన నటజీవితంలో ఎన్నో కలికితురాయిలు..

శోభన్‌బాబు నటించిన బంగారు పంజరం సినిమాకు 1970లో ఉత్తమ క్లాసికల్ చిత్రంగా కేంద్ర ప్రభుత్వ అవార్డు లభించింది. ఈ క్రమంలో ఫిల్మాలయ, సినీ వరల్డ్, సినీ ఎక్స్‌ప్రెస్, కళాసాగర్, కళాస్రవంతి వంటి మరెన్నో అవార్డులు తనను వరించాయి.

ముఖ్యంగా ఊర్వశి శారదతో కలిసి తాను నటించిన పలు సినిమాలు విజయవంతమయ్యాయి. తెలుగు చిత్ర పరిశ్రమ సర్వకాలాల్లోనూ విజయవంతమైన జంట అనే ఘనత వీరికే దక్కింది. దాదాపు 30 సంవత్సరాలపాటు తెలుగు సినీ రంగంలో గ్లామర్‌కు ఫర్మార్మెన్స్‌కు మారుపేరుగా నిలిచిన అద్వితీయ నటుడు శోభన్‌బాబు.

శోభన్‌బాబును ఆరోజుల్లో ఆంధ్రా అందగాడు అని పిలిచేవారు. 30 ఏళ్లు చిత్రపరిశ్రమలో నటించిన శోభన్‌బాబు ఏ తెలుగు హీరో సాధించలేనన్ని అవార్డులను దక్కించుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో 20 ఏళ్లపాటు అసంఖ్యాక మహిళల హృదయాల్లో కలవరం పుట్టించిన నటుడు ఎవరు అంటే శోభన్‌బాబే అని చెప్పాలి.

మహిళల్లో ఆయన సాధించిన పాపులారిటీ ఎంత గొప్పదంటే ఈ రోజుకీ మంచి కుటుంబ కథా చిత్రంగా దేన్నయినా ప్రస్తావించదల్చినప్పుడు, ఇది శోభన్‌బాబు తరహా మూవీ అంటూ కితాబివ్వడం తెలిసిన విషయమే. చలన చిత్ర చరిత్రలో ఆయన 'నటభూషణ'గా నిలిచిపోయారు.

తెలుగు సినిమాకు సంబంధించినంతవరకు తన సమకాలీకులు, సీనియర్ నటీనటులు సంపాదించిన సొమ్మును చిత్రనిర్మాణంలోనూ ఇతరత్రా ఖర్చుపెట్టి నిలువు దోపిడీకి గురైన కథనాలే జాస్తి. శోభన్‌బాబు మాత్రం తన జీవితాన్ని తొలినుంచి ప్రణాళికాబద్దంగా తీర్తిదిద్దుకున్నారు. తన సంపాదన అంతటినీ రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో పెట్టి తన శేషజీవితాన్ని ప్రశాంతంగా కుటుంబ సభ్యులమధ్య గడుపుతూ వచ్చారు.

తన వయసుకు తగిన పాత్రలనే ధరిస్తూ వచ్చిన శోభన్‌బాబు కెరీర్ చరమాంకంలో కొన్ని కేరక్టర్ పాత్రలను ఎంచుకున్నారు. ఆయన నటించిన చివరి చిత్రం 1997లో వచ్చిన అడవి దొర. దీని తర్వాత ఆయన చిత్రాలలోంచి విరమించుకుని ప్రశాంతమైన ఫలవంతమైన జీవితాన్ని ఎంచుకున్నారు. తన 70వ పుట్టిన రోజును 2007 జనవరి 14న జరుపుకున్నారు.
About Writer
Raju