1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

గమ్యం అర్ధ శతదినోత్సవ వేడుకలు

గమ్యం అర్ధ శతదినోత్సవ
WD PhotoWD
శర్వానంద్ హీరోగా, కమిలినీముఖర్జీ హీరోయిన్‌గా రాధాకృష్ణ దర్శకత్వంలో విడుదలైన చిత్రం గమ్యం. ఈ చిత్రంలో అల్లరి నరేష్ ఓ ముఖ్యపాత్రలో నటించడం విశేషం. ఈ చిత్రం విజయవంతంగా యాభైరోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం రాత్రి విజయోత్సవ వేడుకలు నిర్వహించారు.

ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి అనేకమంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మాతల మండలి అధ్యక్షుడు భరద్వాజ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తెలుగు సినిమాలు ఎలా ఉంటాయో ఈ చిత్రం ద్వారా నిజమైందని అన్నారు.

పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జనంలో పెరిగిన స్పీడును అందుకోవడంలో దర్శకుడు విజయం సాధించారని అన్నారు. ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ ఈ చిత్రం దర్శకుడు విదేశాల్లో ఉన్నా మన మట్టి వాసన మరిచి పోలేదని అన్నారు. ఈ చిత్రంలో నరేష్ సైతం హీరోనే అని ఆయన అభినందించారు.

ఇ.వి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ నరేష్ ఈ చిత్రం ద్వారా గాలిశీను పేరును తెచ్చుకున్నాడని అన్నారు. నరేష్ మాట్లాడుతూ ఈ చిత్రంలో తనది సపోర్టింగ్ క్యారెక్టర్ మాత్రమేనని, శర్వానందే ఈ చిత్రానికి నిజమైన హీరో అని అన్నారు. ఈ చిత్రానికి విజయం చేకూర్చినందుకు ఆయన అందరికి కృతజ్ఞతలు తెలిపారు.

శర్వానంద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ గమ్యాన్ని చేరుకోవాలని ఆశిస్తారని, తామీ విషయంలో గమ్యం చేరుకున్నామని పేర్కొన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ఈ చిత్రం విడుదలకు సహకరించిన భరద్వాజకు తన కృతజ్ఞతలు తెలిపారు.
About Writer
Munibabu