వైవిధ్య పాత్రల పోషణ నందమూరి వంశానికే సాధ్యం: బాలకృష్ణ
|
మచిలీపట్నంలోని హిందూ కళాశాల ఆవరణలో ఆదివారం సాయత్రం పాండురంగడు చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ నందమూరి వంశం పోషించిన పాత్రల్ని పోషించాలంటే మరెవరి వల్లా కాదని అన్నారు.
గతంలో తనతండ్రి ఎన్టీఆర్ నటించిన పాండురంగ మహత్యం చిత్రం లాగే ప్రస్తుతం తాను నటించిన పాండురంగడు చిత్రం సైతం ప్రేక్షకాదరణ పొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సంగీతం, సాహిత్యం పెడదారి పట్టిపోతోందని దానిని సక్రమమైన బాటలో పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు విచ్చేశారు. వారిలో ప్రముఖ దర్శకులు, నటులు అయిన విశ్వనాథ్ మాట్లాడుతూ ప్రేక్షకుల అభిరుచి మేరకు పాండురంగడు చిత్రాన్ని ఎన్నో వ్యయప్రయాసలకోర్చి చిత్రీకరించడం జరిగిందని అన్నారు. ఈ చిత్రంలో పాటలు అద్భుతంగా ఉందని ఆయన కితాబిచ్చారు.
అనంతరం జరిగిన కార్యక్రమంలో పాండురంగడు చిత్రం దర్శకుడు రాఘవేంద్రరావును నిర్మాత కృష్ణమోహన్ పూలమాలతో అభినందించారు. ఈ కార్యక్రమానికి పాండురంగడు చిత్ర కథానాయకలైన స్నేహ, అర్చనలతో పాటు సుహాసిని, అపూర్వ, గుండు హనుమంతరావు, అనంత్, సత్తిపండు తదితరులు విచ్చేశారు.
అలాగే సంగీత దర్శకులు కీరవాణి, ఎడిటర్ శ్రీకాంతప్రసాద్, నిర్మాణనిర్వాహకులు వి. జయరామ్, కళా దర్శకులు భాస్కరరాజు, రచయితలు వేదవ్యాస్, సుద్ధాల అశోక్‌తేజ, గుడివాడ శాసనసభ్యులు, సినీ నిర్మాత కొడాలి నాని తదితరులు విచ్చేశారు.
ఆర్‌కే ఫిలిమ్ అసోసియేట్స్ నిర్మించిన ఈ పాండురంగడు చిత్రం ఆడియోను కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ శైలజా రామయ్యర్ ఆవిష్కరించారు.ఆదిత్య మ్యూజిక్స్ ద్వారా పాండురంగడు ఆడియోను మార్కెట్‌లోకి విడుదల చేశారు.