నాగబాబు హీరోగా ప్రారంభమైన రాంగ్ నెంబర్
|
సోమవారం జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేటు భవంతిలో ప్రారంభమైన ఈ చిత్రానికి సి. కళ్యాణ్ క్లాప్ కొట్టగా, నాగబాబు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ మర్డర్ మిస్టరీ ప్రధానాంశాలుగా ఈ చిత్రం తెరకెక్కుతోందని అన్నారు. మే ఆరువరకు హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్ చిత్రీకరించనున్నామని ఆయన చెప్పారు. అటుపై ముంబైలో 15 రోజులపాటు షూటింగ్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
ఈ రెండు షెడ్యూల్స్ తర్వాత క్లైమాక్స్‌ను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తామని చెప్పారు. ఈ చిత్రంలో నాగబాబు ప్రధాన పాత్ర పోషిస్తుండడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ చిత్రం హిందీ వెర్షన్‌లో తొలుత జాకీష్రాప్‌ను అనుకున్నామని, కానీ హిందీలో సైతం నాగబాబు ప్రధానపాత్రలో పోషించనున్నారని ఆయన వివరించారు.
దర్శకుడు మాట్లాడుతూ ఐదుగురు యువకులు, యువతుల మధ్య సాగే కథతో ఈ చిత్రం రూపొందనుందని తెలిపారు. ఈ చిత్రంలో నటిస్తోన్న రీతు, టోనీ, ప్రియ, జతిన్ తదితరులు మాట్లాడుతూ తెలుగులో తాము పరిచయం కావడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ చిత్రానికి మాటలు- సుభాష్ మెహ్రా, సంగీతం- జతిన్, లలిత్, కెమెరా- గోపాల్‌దేవ్, ఎడిటింగ్- పి. శ్రీనివాస్.