భారతీయ చలనచిత్ర చరిత్రలో మరో సువర్ణ అధ్యాయానికి రంగం సిద్ధమైంది. తన విభిన్నమైన నటనా ప్రతిభతో దక్షిణాది సినీ జగత్తులో ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించిన పద్మశ్రీ కమల్‌హసన్ తన తాజా చిత్రం దశావతారంతో మరో అద్భుతానికి శ్రీకారం చుట్టనున్నారు.
కెరీర్ ప్రారంభం నుంచి ప్రత్యేకమైన పాత్రలతో, తనకు మాత్రమే వీలైన సరికొత్త ఆహార్యంతో ప్రేక్షకుల మది దోచుకున్న కమల్ నటుడికి భాషా భేదం అడ్డురాదని నిరూపించారు. పుట్టింది, పెరిగింది నటన ప్రారంభించింది తమిళంలోనైనా ఇతర భాషల ప్రేక్షకుల్ని సైతం కమల్ ఆకట్టుకోగలిగారు.
కమల్ చిత్రం ఏ భాషలో నిర్మించబడినా అది ఇతర భాషల్లోకి అనువాదమై అన్ని భాషల ప్రేక్షకులను మెప్పించగలగడం విశేషం. కెరీర్ ప్రారంభం నుంచి ప్రతి చిత్రంలో ఏదో ఒక వైవిధ్యాన్ని ప్రదర్శించడం కమల్‌కు పరిపాటిగా మారింది. ఆకలిరాజ్యం, మరోచరిత్ర, సాగరసంగమం, స్వాతిముత్యం, నాయకుడు, అపూర్వ సహోదరులు, భారతీయుడు, అభయ్, భామనే సత్యభామనే... ఇలా చెప్పుకుంటూ పోతే కమల్ కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచిన చిత్రాలెన్నో.
ఓ చిత్రంలో మానసిక వికలాంగునిగా, మరో చిత్రంలో మరుగుజ్జుగా, ఓకే రూపమున్న నలుగురు సోదరులుగా, మసలి బ్రాహ్మణ స్త్రీగా ఇలా ఎన్నో రకాల పాత్రలతో మెప్పించడం కమల్ ప్రత్యేకత. ఆ కోవలో ప్రస్తుతం పది పాత్రలతో రానున్న దశావతారం చిత్రం నిజంగానే అద్భుత కళాఖండంగా చెప్పవచ్చు.
ఎందుకంటే అక్కినేని నాగేశ్వరరావు తొమ్మిది పాత్రలు పోషించిన నవరాత్రి చిత్రం ఇప్పటివరకు వెండితెరపై అత్యధిక పాత్రలను ఒకే నటుడు పోషించిన చిత్రమైతే ఆ తర్వాత అంతకంటే ఎక్కువ పాత్రల్లో ఒకే నటుడు నటించిన చిత్రం ఈ దశావతారం కావడం విశేషం.
రంగరాజ నంబి, అవతార్ సింగ్, గోవిందరాజులు, అమెరికా అధ్యక్షుడు, కాలీపుల్లా ఖాన్, క్రిస్టియన్, పుణ్యకోటి, సింగేన్ నరహసి, కృష్ణవేణి భామ్మ, బలరామ్ నాడార్ ఇలా పది విభిన్న పాత్రలతో కమల్ నటించిన ఈ దశావతారం చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లేలను ఆయనే స్వయంగా అందించడం కూడా ఓ విశేషమే.
కె.ఎస్. రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఆస్కార్ రవిచంద్రన్ నిర్మాత. గత రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను ముగించుకుని జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమౌతోంది.
హాలీవుడ్ సూపర్‌స్టార్ జాకీఛాన్ చేతుల మీదుగా ఈ చిత్రం ఆడియో ఇటీవల ఘనంగా విడుదలైంది. హిమేష్ రెషమ్మియా ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చగా, దేవీశ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం అందించడం విశేషం. ఈ చిత్రంలో అసిన్, మల్లిక షెరావత్, జయప్రద ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
|