మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సభ్యులకు అపోలో ఆస్పత్రికి సంబంధించిన ఆరోగ్య కార్డులను అధ్యక్షుడు నాగబాబు అందజేశారు. సోమవారం రాత్రి జూబ్లిహిల్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ మా తరపున గతంలో మెడిక్లెయిమ్ కార్డులను సభ్యులకు అందజేశామని ప్రస్తుతం అపోలో ఆస్పత్రితో కుదుర్చున్న ఆరోగ్య పథకం ద్వారా ఈ ఆరోగ్య కార్డులను అందజేస్తున్నామని తెలిపారు. మా సభ్యులు ఈ కార్డులను సక్రమంగా ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.
పేద, మధ్యతరగతి నటీనటులకు ఈ కార్డుల వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని ఆయన తెలిపారు. గతంలో మెడిక్లెయిమ్ కార్డులను దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు వచ్చాయని, ప్రస్తుతం ఇచ్చిన ఈ కార్డులను దుర్వినియోగం చేయరాదని ఆయన విజ్ఞప్తి చేశారు. అపోలో ఆస్పత్రికి సంబంధించిన అన్ని బ్రాంచిల్లోను ఈ కార్డులను ఉపయోగించుకోవచ్చని ఆయన తెలిపారు.
మా ఉపాధ్యక్షుడు, నటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ లక్ష్యా యాభైవేల వరకు ఈ కార్డుల ద్వారా మా సభ్యులు, వారి కుటుంబ సభ్యులు వైద్య సేవలు పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరుచూరి వెంకటేశ్వరరావు, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
|