రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన గోల్డ్‌క్వెస్ట్ వ్యవహారంలో సీనియర్ నటుడు చంద్రమోహన్ చేసిన వ్యాఖ్యలపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) చర్య తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ఇండస్ట్రీలో వారంతా మోసకార్లే. ఏదో పదిశాతం మినహా మిగిలినవారంతా దొంగలే అంటూ చంద్రమోహన్ చేసిన వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీ పెద్దలకు చుర్రుమనిపించాయి. దీంతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా పరిస్థితులను సమిక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటామని మా సభ్యులు బుధవారం తెలిపారు.
సంచలనం సృష్టించిన ఈ విషయం వివరాళ్లోకి వెళితే... గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో పలు శాఖలున్న గోల్డ్‌క్వెస్ట్ సంస్థ చైన్ సిస్టమ్ ద్వారా తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇందులో సభ్యులను చేర్పిస్తే మెంబర్‌కు బంగారు నాణాలు ఇస్తామని సంస్థ ప్రచారం చేసింది. ఇలా కొనసాగుతున్న గోల్డ్‌క్వెస్ట్ వ్యవహారం అంతా మోసమని మంగళవారం బయటపడింది.
దీంతో హైదరాబాద్‌లోని గోల్డ్‌క్వెస్ట్ కార్యాలయాలు మూతపడ్డాయి. ఈ కార్యాలయాలున్న బిల్డింగుల్లో ఎక్కువభాగం నటుడు చంద్రమోహన్‌వి కావడంతో ఆయనను మీడియా ప్రశ్నించింది. దీంతో చంద్రమోహన్ స్పందిస్తూ మోసం ఏమీ జరగలేదు తొందరపడకండి అంటూనే... మోసాలు ఎక్కడలేవు సినిమా ఇండస్ట్రీలో 10 శాతం మినహా అంతా మోసకార్లే ప్రొడక్షన్ మేనేజర్ల నుంచి అంతా మోసం చేసేవారే అంటూ ధ్వజమెత్తారు.
ఈ విషయాన్ని మీడియా హైలెట్ చేసేసరికి ఈ విషయంపై మా బుధవారం స్పంధించింది. ఈ విషయంపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని మా అధ్యక్షుడు నాగబాబు నిర్ణయించారు. సమావేశం ఎప్పుడు అనే విషయాన్ని త్వరలోనే తెలియజేస్తామని మా ప్రధాన కార్యదర్శి మల్లికార్జునరావు తెలిపారు.
అలాగే ఆయన మాట్లాడుతూ ఈరోజు (బుధవారం) తాను ఆఫీసుకు వచ్చేసరికి తన టేబుల్‌పై ఓ లెటర్ ఉందంటూ దాన్ని చదివి వినిపించారు. చంద్రమోహన్ రాసినట్టుగా చెబుతున్న ఆ లెటర్‌లో... 42 ఏళ్లుగా ఇండస్ట్రీ ఫుడ్ తింటున్న తాను అలా అనలేదని, మీడియా తన మాటల్ని వక్రీకరించిందని చంద్రమోహన్ పేర్కొన్నారు.
ఈ లెటర్ సంగతి ఎలా ఉన్నా చంద్రమోహన్ అన్నట్టుగా చెబుతున్న విషయాల క్లిప్పింగ్స్ తీసుకుని ఆయనపై చర్య తీసుకునే విషయం ఆలోచిస్తామని మల్లికార్జునరావు తెలిపారు. సో ముందు ముందు ఈ విషయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి మరి.
|