1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

మళ్లీ తెరపై బిజీ కానున్న జేడీ చక్రవర్తి

మళ్లీ తెరపై బిజీ జేడీ చక్రవర్తి
నాగార్జున హీరోగా రూపొందిన 'శివ' చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. తెలుగు తెరపై అనేక రకాల మార్పులకు శ్రీకారం చుట్టిన చిత్రంగా 'శివ' గురించి చెప్పవచ్చు. స్క్రీన్‌ప్లేకు కొత్త నిర్వచనం చెబుతూ రామ్‌గోపాల్ వర్మ దర్శకునిగా పరిచయమైతే, విలనిజానికి కొత్త అర్ధం చెబుతూ రఘువరన్ ఈ చిత్రం ద్వారా పరిచయమయ్యాడు.

అంతేకాకుండా శివ చిత్రంతో మరికొంతమంది కూడా తెలుగుతెరకు పరిచయమయ్యారు. అలా శివ చిత్రంలో జేడీ పాత్ర ద్వారా తెరగేట్రం చేసినవాడే జేడీ చక్రవర్తి. ప్రారంభంలో చిన్నా చితకా పాత్రలతో నెట్టుకొచ్చిన జేడీ ఆ తర్వాత సోలో హీరోగా మంచి హిట్లే సాధించాడు.

గులాబి, అనగనగా ఒకరోజు, మని, బొంబాయి ప్రియుడు... ఇలా అనేక హిట్ చిత్రాల్లో నటించిన జేడీ క్రమంగా అవకాశాలు తగ్గిపోయి ముంబయి చేరుకుని వర్మ స్కూల్లో చేరిపోయాడు.

దీంతో నటనను పక్కనపెట్టి దర్శకత్వం చేపట్టాడు. అలా తెలుగుతెరపై జేడీని అందరూ మర్చిపోయిన దశలో 'దుబాయి శీను' చిత్రంలో అతిధి పాత్రలో కనిపించాడు. అటుపై జగపతిబాబు హీరోగా 'హోమం' అనే చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు అందులో విలన్‌గా కూడా నటించాడు. ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు.

ఇలా తెలుగుతెరపై మళ్లీ బిజీ అవుతున్న దశలో జెడీని మరో అదృష్టం వరించింది. రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న రోబో చిత్రంలో విలన్ పాత్రకు జేడీని సంప్రదించారట. అంతేనా విలన్ పాత్రకు జేడీ బాగుంటాడని రజనీనే స్వయంగా సూచించారని సమాచారం.

దాంతో రోబోలో నటించే అవకాశం జేడీకి లభించిందట. ఇవన్నీ చూస్తుంటే జేడీ మళ్లీ తన కెరీర్‌లో బిజీగా మారే అవకాశాలు కన్పిస్తున్నాయి.
About Writer
Munibabu