ప్రత్యేక ఆర్థిక మండళ్ల(సెజ్) వల్ల రైతులు పడుతున్న కష్టాల్నితెలియజేస్తూ నిర్మించిన ఎర్రసముద్రం చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారని ఆర్. నారాయణమూర్తి తెలిపారు. మేడే దినోత్సవం రోజున విడుదలైన ఈ చిత్రం ప్రోగ్రెస్ గురించి వివరించడానికి బుధవారం నారాయణమూర్తి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తోన్న సెజ్‌ల వల్ల పచ్చటి పంట పొలాలు కనుమరుగవుతున్నాయని అన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ చేతిలో మన పాలకులు బందీలవుతున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. వాళ్ల నిబంధనల్ని మన్నించడం వల్లనే పంటలు పండే పొలాల్లో సెజ్‌లు వెలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఈ వాస్తవాల్ని చక్కగా చూపించినందువల్లే తమ ఎర్రసముద్రం చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని రైతులకు గిట్టుబాటు ధర లభించని నేపథ్యంలో సెజ్‌ల ద్వారా వారికి మరింత నష్టం కలుగుతోందన్నారు.
అలాగే ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అన్ని రంగాలు ప్రైవేటు పరం అవుతున్నాయని ఈ పద్ధతి మంచిది కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రానికి సంగీతం అందించిన వందేమాతరం శ్రీనివాస్, పాటల రచయిత అందెశ్రీ తదితరులు పాల్గొన్నారు.
|