1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

''చిరు'' మరోసారి ఆలోచించుకో: పెద్దల సలహా

చిరు మరోసారి ఆలోచించుకో పెద్దల సలహా
WD PhotoWD
మెగాస్టార్ చిరంజీవి తన రాజకీయ ప్రవేశం గురించి ప్రత్యక్షంగా ఎలాంటి ప్రకటనా చేయకపోయినా ఆయన పార్టీ పెడుతారన్న అంశంపై ఒక్కొకరు ఒక్కోలా వ్యాఖ్యానిస్తున్నారు.

సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ విషయంపై తన మంత్రివర్గ సహచరులతో మాట్లాడుతూ చిరంజీవి పార్టీ పెడితే కాంగ్రెస్‌కు వచ్చిన నష్టమేమీ లేదని అన్నారట.

మరోవైపు కాంగ్రెస్ పార్టీని గద్దె దించాలంటే చిరంజీవి తెలుగుదేశం పార్టీతో చేయి కలపాలని సీపీఎం కార్యదర్శి బీవీ రాఘవులు పత్రికల వారితో సైతం అన్నారు. అదేసమయంలో చిరంజీవి బావమరిది అల్లు అర్జున్ ఆమధ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చిరంజీవి మరో రెండు నెలల్లో ఓ నిర్ణయం తీసుకుంటారని కూడా ప్రకటించారు.

అదిగో వస్తున్నారు... ఇదిగో వచ్చేస్తున్నారు... అంటూ చిరంజీవి గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా వ్యాఖ్యానిస్తున్నా చిరంజీవి మాత్రం నోరు మెదపడం లేదు. అయితే చిరంజీవి రాజకీయ ప్రవేశంపై వీరంతా ఈవిధంగా వ్యాఖ్యానిస్తుంటే ఆయన సొంత ఊరికి చెందిన కొందరు పెద్దలు మాత్రం మరోలా వ్యాఖ్యానిస్తున్నారు.

మెగాస్టార్‌గా సినీ ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలున్న చిరంజీవి ప్రస్తుతం కుమారుని సినీరంగ ప్రవేశం, సోదరులు సైతం ఇండస్ట్రీలో మంచి స్థాయిలో ఉండడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా ఉన్నారు. అలాంటి తరుణంలో చిరంజీవి ఎందుకు రాజకీయాల్లోకి రావాలి. వచ్చి ఏం సాధించాలి. రాజకీయాల్లోకి వచ్చి తనకున్న మంచిపేరు చెడగొట్టుకోవడం తప్ప అని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

అందుకే చిరంజీవి తన రాజకీయ ప్రవేశంపై మరోసారి జాగ్రత్తగా ఆలోచించాలని వెస్ట్ గోదావరికి చెందిన చిరంజీవి బంధువులు కొందరు అల్లు అరవింద్‌కు ఫోన్ చేసినట్టు తాజా సమాచారం. గతంలో ఎంతో పేరున్న రామారావును సైతం రాజకీయాల్లో అణగదొక్కేసిన వైనాన్ని చిరంజీవి గుణపాఠంగా తీసుకుని జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని వారు కోరినట్టు తెలుస్తోంది.

చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి తనకున్న పేరు చెడగొట్టుకోకుండా సామాజిక కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని వారు కోరుతున్నారు. ఇలా తన రాజకీయ ప్రవేశంపై ఇంతమంది ఇన్ని విధాలుగా అనుకుంటున్నవేళ చిరంజీవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.