పాండురంగడు నిజమైన యూత్ చిత్రం: దర్శకుల ప్రశంస
|
రాఘవేంద్రరావు దర్శకత్వంలో అలనాడు ఎన్టీఆర్ నటించిన పాండురంగ మహత్యం చిత్రం మళ్లీ పాండురంగడు పేరుతో తెరకెక్కింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ఆడియో డబుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుకలను ఆదివారం ప్రసాద్‌ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరుచూరి బ్రదర్స్, డి. రామానాయుడు, తమ్మారెడ్డి భరద్వాజ్, కీరవాణి, ఎస్.పి. బాలసుబ్రమణ్యం, బి.గోపాల్, వి.వి.వినాయక్, శేఖర్‌కమ్ముల, రాధాకృష్ణ (క్రిష్), హరనాథరావు, ఆర్. నారాయణమూర్తి, అలీ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన వారు మాట్లడుతూ పాండురంగడు లాంటి భక్తి ప్రధాన చిత్రాల్ని రాఘవేంద్రరావు మాత్రమే తీయగలరని, ఇలాంటి చిత్రాల్ని రాఘవేంద్రరావు, కీరవాణి కాంబినేషన్‌లో మాత్రమే చూడగలమని ప్రశంసించారు. మన సంస్కృతి, సాంప్రదాయాలు కనుమరుగవుతున్న తరుణంలో ఇలాంటి చిత్రాలు రావడం మహదానందమని అన్నారు.
హీరో బాలకృష్ణ మాట్లాడుతూ ఈనాటికీ కళలు, సాంప్రదాయాలు బ్రతికున్నాయంటే అవి కేవలం సినిమాల వల్లే అని అన్నారు. పండితపామరులను సైతం మైమరపించే శక్తి కేవలం సంగీతానికే ఉందని అన్నారు. అయితే నేడు చిత్ర నిర్మాతల అభిరుచి మేరకు సంగీతం పక్కదారి పడుతోందని విమర్మించారు.
కీరవాణి, ఎస్.పి.బాలు లేకుంటే పాండురంగడు పాటలు ఇంతబాగా వచ్చేవి కావని ఆయన ప్రశంసించారు. ఎన్టీఆర్ అంటే ఓ నటనాలయం, రాజర్షి, రాజసం ఉట్టిపడే తేజస్సు ఆయన సొంతం. అలాంటి వ్యక్తికి బిడ్డగా జన్మించడం తన అదృష్టమని ఈ సందర్భంగా బాలకృష్ణ అన్నారు. అందుకే ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ప్రతిష్టను ఇనుమడింపజేస్తానని ఆయన చెప్పారు.
ఈ వేదికపై దర్శకుడు రాఘవేంద్రరావు మాటలుగా రచయిత భారవి కొన్ని వ్యాఖ్యలు వినిపించారు. నేటితరం యువ దర్శకులు తమ తెలివితేటలతో ఇలాంటి చిత్రాలను తీయాలని కోరారు. ఇందుకు దర్శకుడు వి.వి. వినాయక్ ప్రతిస్పందిస్తూ ఇలాంటి చిత్రాలు కేవలం రాఘవేంద్రరావు మాత్రమే తీయగలరని అన్నారు. అయితే భారవి లాంటి రచయితలు కథలను అందిస్తే తాము ఇలాంటి చిత్రాలు తీయడానికి ప్రయత్నిస్తామన్నారు.
మరో దర్శకుడు శేఖర్‌కమ్ముల మాట్లాడుతూ ఈ చిత్రం గురించి జడ్జిమెంట్ చేసే స్థాయికి తానింకా చేరలేదని, అవకాశం లభిస్తే తానూ ఇలాంటి చిత్రాలు తీయడానికి ప్రయత్నిస్తానన్నారు. ఎస్.పి. బాలు మాట్లాడుతూ కేవలం ఫ్యాన్స్ చూస్తే చిత్రాలు ఆడవని, కుటుంబం మొత్తం చూస్తేన్ చిత్రాలు విజయం సాధిస్తాయని అన్నారు. ఈనాటి నిర్మాతలు గాయనీగాయకుల చేత పాటలు పాడించి చివర్లో ట్రాకులు మార్చేస్తున్నారని ఆయన విమర్శించారు.
కీరవాణి మాట్లాడుతూ పాటకు నడక నేర్పిన రాఘవేంద్రరావుతో ఓ సందర్భంలో గొడపడ్డానన్నారు. దానిని ప్రస్తుతం ఈ సభా వేదికపై సరిదిద్దుకుంటున్నాను అన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ లేని లోటును బాలకృష్ణ తీరుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. చివరగా డి. రామానాయుడు చేతులమీదుగా పాండురంగడు యూనిట్‌కు ప్లాటినం డిస్క్‌లను అందజేశారు.