''కంత్రి'' సెన్సేషనల్ హిట్: అశ్వినీదత్
|
ఎన్టీఆర్ హీరోగా మొహర్‌రమేష్ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం కంత్రి. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మించారు. ఈ చిత్రం విడుదలై మూడురోజులు పూర్తయిన సందర్భంగా అశ్వినీదత్ సోమవారం రాత్రి విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు.
ఈ సందర్భంగా ఆయన తన మనసులోని భావాలను విలేకరులతో పంచుకున్నారు. తమ వైజయంతీ మూవీస్ పతాకంపై గత 33 ఏళ్లనుంచి చిత్రాలు నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. అలనాటి ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌లతో మొదలెట్టిన తమ సినీ నిర్మాణ పయనం నేటివరకు కొనసాగుతోందని ఆయన వివరించారు.
గతంలో నిర్మించిన ఇంద్ర, పెళ్లాం ఊరెళితే... చిత్రాలు విజయం సాధించినపుడే తాను మీడియాతో మాట్లాడాలనుకున్నానని ఆయన అన్నారు. కానీ అప్పుడు తాను మీడియాను కలవలేకపోయానన్నారు. అలాగే తర్వాత సైతం ప్రయత్నించినా వీలుకాలేదని ఆయన అన్నారు. అయితే మీడియాను కలవాలన్న కోరిక తనలో కొద్దికాలంగా అలాగే ఉండిపోయిందని ఆయన వివరించారు.
అందుకే ఎన్టీఆర్ హీరోగా నిర్మించిన కంత్రి చిత్రం విడుదలై ఘన విజయం సాధించిన సందర్భంగా తాను మీడియా ముందుకు వచ్చానని ఆయన అన్నారు. అయితే చిత్రం విడుదలైన మూడురోజుల్లోనే కంత్రి ఘనవిజయం సాధించిందని ఎలా చెప్పగలుగుతున్నారు అని మీకు సందేహం రావచ్చు... కానీ అన్నం ఉడికిందో లేదో తెలియడానికి ఒక్క మెతుకు చూస్తే చాలు. అలాగే కంత్రి చిత్రం మూడురోజులుగా సాధించిన విజయం ప్రాతిపదికగానే తాను అలా చెప్పగలిగానని ఆయన అన్నారు.
తమ బ్యానర్‌లో రాఘవేంద్రరావు, గోపాల్ లాంటి అగ్రశ్రేణి దర్శకులు పనిచేశారని ఆయన అన్నారు. తాను నిర్మించే దాదాపు ప్రతి చిత్రాన్ని 20-25 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తుంటానని ఆయన తెలిపారు.