1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. పోలీసుల క్లీన్ చిట్: ఊపిరి పీల్చుకున్న మల్లిక

పోలీసుల క్లీన్ చిట్: ఊపిరి పీల్చుకున్న మల్లిక

బాలీవుడ్ సెక్సీ క్వీన్ మల్లికా షెరావత్ ఊపిరి
బాలీవుడ్ సెక్సీ క్వీన్ మల్లికా షెరావత్ ఊపిరి పీల్చుకుంది. కురచ దుస్తులతో చెన్నై నగర వాసులను మంత్రముగ్ధులను చేసిన ఈ భామకు చెన్నై నగర పోలీసులు అండగా నిలిచారు. పద్మశ్రీ కమల్‌హాసన్ హీరోగా నటించిన 'దశావతారం' చిత్రం ఆడియో కార్యక్రమం ఇటీవల చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగింది.

ఇందులో హాలీవుడ్ సూపర్‌స్టార్ జాకీ చాన్, మళయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి, బాలీవుడ్ 'బిగ్‌ బి' అమితాబ్, ముఖ్యమంత్రి కరుణానిధి వంటి హేమాహెమీలు పాల్గొన్నారు. 'దశావతారం' చిత్రంలో నటిస్తున్న మల్లికా షెరావత్.. ఆడియో విడుదల కార్యక్రమానికి కురచ దుస్తులతో హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతేకాకుండా.. వేదికపై జాకీచాన్, మల్లికలు ముద్దులు పెట్టుకున్నారు.

దీంతో రాష్ట్రంలోని కొన్ని హిందూ మత సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మల్లిక ధరించిన దుస్తులు అసభ్యకరంగా ఉన్నాయని, ముఖ్యంగా తమిళుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని పేర్కొంటూ హిందూ మున్నణి కట్చి (పార్టీ) ఆరోపించింది. ఈ వ్యవహారం పట్ల ఆమెపై చర్య తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై చెన్నై నగర పోలీసు కమిషనర్ నాంజిల్ కుమరన్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి పోలీసు బృందం విచారించి ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది. మల్లిక ధరించిన దుస్తులు మన కట్టుబాట్ల మేరకే ఉన్నట్టు పోలీసులు తేల్చి చెప్పారు.
About Writer
PNR