ఇందిరా ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై వంశీరాజు దర్శకునిగా రూపొందుతోన్న చిత్రం '4కపుల్స్'. తాండూరు జనార్ధనరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూర్యవంశీ, మధు జంటగా నటిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.
ఈ షూటింగ్‌లో భాగంగా డాన్సర్ అభినయశ్రీపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ప్రేమించుకుని ఇంటినుంచి పారిపోయిన జంట బయట ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంది. తమకు ఎదురైన ఇబ్బందుల నుంచి చివరకు ఎలా విజయం సాధించింది అన్న పాయింట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది అన్నారు.
నటుడు రామిరెడ్డి మాట్లాడుతూ తాను ఈ చిత్రంలో మాంత్రికుడు పాత్ర పోషిస్తున్నానని తెలిపారు. కళ్ళు చిదంబరం మాట్లాడుతూ ఇలాంటి చిన్న చిత్రాలు విజయవంతం అయితేనే తమలాంటి చిన్న నటీనటులకు, టెక్నీషియన్లకు అవకాశం లభిస్తుందని అన్నారు.
అభినయశ్రీ మాట్లాడుతూ తాను నటిస్తున్న పాట చాలా బాగుందని చిత్రం విజయవంతం కావాలని తాను ఆశిస్తున్నట్టు తెలిపింది.
ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో జెన్ని, యస్.కె.కె. శర్మ, తిలక్, జూనియర్ రేలంగి, ధూళిపాళ్ళ, జెమిని రాఘవ, తాండూరు జనార్థనరెడ్డి, పొట్టి రాంబాబు, సైరాభాను తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి ఎడిటింగ్- శ్రీను, కెమెరా- సుధాకర్ నాయుడు, సంగీతం- అర్జున్, డాన్స్- హేమలత, రాజు.
|