కెమరా ముందు బాలీవుడ్ దంపతుల జంట
|
ప్రారంభ సన్నివేశంగా అభి-ఐష్‌లపై తొలి షాట్ చిత్రీకరణ జరిగింది. పెళ్లయిన తర్వాత తొలిసారిగా కలిసి నటిస్తున్నా.. వారిద్దరూ సాధారణ నటీనటుల మాదిరిగానే వ్యవహరించారని ఈ చిత్రం యూనిట్ హర్షంతో పాటు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గతంలో వచ్చిన 'సర్కార్'కు రెండో భాగం.
మధూర్ భండార్కర్ తీసిన 'కార్పొరేట్' చిత్రంలో నటి బిపాసా బసు పోషించిన పాత్ర వలె ఈ చిత్రంలో ఐశ్వర్యా రాయ్ పాత్ర ఉంటుందని చిత్ర యూనిట్ చెపుతోంది. ఇక చిత్ర కథను పరిశీలిస్తే.. ఒక అంతర్జాతీయ కంపెనీకి అనితా రాజన్ (ఐశ్వర్యారాయ్) సీఈఓ. మహారాష్ట్రలోని ఓ కుగ్రామంలో విద్యుత్ ప్లాంట్ నెలకొల్పాలని భావిస్తుంది. దీనిని సుభాష్ నాగ్రే (అమి తాబ్‌బచ్చన్) గట్టిగా వ్యతిరేకిస్తాడు.
ఈ ప్రాజెక్టును తొలుత వ్యతిరేకించిన శంకర్ నాగ్రే (అభిషేక్ బచ్చన్) ఆ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే కలిగే లాభాలు తెలుసుకొని అనితా రాజన్‌కు మద్దతు పలుకుతాడు. ప్రాజెక్టు నిర్మాణ క్రమంలో రాజకీయాలు ఎలా ప్రవేశించాయి? చివరికి గెలుపెవరిది? అనే ఇతివృత్తంతో ఈ చిత్రం సాగుతుంది. వచ్చే నెల ఆరో తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బ్యాంకాక్‌లో నిర్వహించే ఐఐఎఫ్‌ఏ చిత్రోత్సవంలో ఈ చిత్రం ప్రీమియర్ షోను ప్రదర్శించనున్నారు.