దేవీశ్రీ సంగీతం అద్భుతం: అతిథుల ప్రశంస
|
శ్రీనువైట్ల దర్శకత్వంలో రామ్, జెనీలియా జంటగా నటించిన రెడీ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం రాత్రి రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎన్టీఆర్ ఆడియో క్యాసెట్‌ను విడుదల చేసి తొలి క్యాసెట్‌ను హీరో విష్ణుకు అందించారు.
ఆడియో సీడీని రామానాయుడు విడుదల చేసి హీరో తరుణ్‌కు అందించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ దేవీశ్రీని చూస్తుంటే తనకు బప్పీలహరి గుర్తుకు వస్తున్నాడని అన్నారు. బప్పీలహరి మెడలో గొలుసులతో రిథమిక్‌గా ఊగుతూ ఉంటాడు. దేవీశ్రీ చేతిలో గిటార్‌తో రిథమిక్‌గా ఊగుతూ ఉంటాడని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు.
రామానాయుడు మాట్లాడుతూ హీరో రామ్ నటించిన దేవదాసు చిత్రం చూసి తాను అతని అభిమానిని అయ్యానని చిత్రం హిట్ కావాలని ఆశీర్వదించారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ దేవీశ్రీ సంగీతం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు చిత్రపరిశ్రమకు గొప్ప సంగీత దర్శకుడు దొరికాడు అని అన్నారు.
రామ్ మంచినటుడని ఆయన ప్రశంసించారు. గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ స్రవంతి బేనర్ అంటే తన పాటలు ఎక్కువగా ఉంటాయని అయితే ఈ చిత్రంలో ఎక్కువ పాటల్ని రామజోగయ్యశాస్త్రి రాశారని అన్నారు. జోగయ్య ఈ చిత్రానికి చక్కని సాహిత్యాన్ని అందించారని అయన అన్నారు. ఈ పాటలు, సంగీతం ఈ చిత్రం విజయానికి చక్కగా తొడ్పడుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, కోటశ్రీనివాసరావు, శ్రీనువైట్ల, విష్ణు, రామ్ తదితరులు పాల్గొన్నారు.
