1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

ఆర్యన్ రాజేష్, శ్రీహరి కాంబినేషన్‌లో చిత్రం ప్రారంభం

ఆర్యన్ రాజేష్ హీరో చిత్రం ప్రారంభం
WD PhotoWD
హాయ్ చిత్రంతో తెలగుతెరకు పరిచయమైన ప్రముఖ దర్శకుడు ఇ.వి.వి. తనయుడు ఆర్యన్ రాజేష్ కొద్దికాలంగా చిత్రాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా ఓ చిత్రం ప్రారంభమైంది. లివింగ్ లెజెండ్స్ క్రియేషన్స్ పతాకంపై ఎల్. ఈశ్వర్ నిర్మిస్తున్న చిత్రంలో ఆర్యన్ రాజేష్ నటిస్తున్నారు.

ఈ చిత్రానికి రామకృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో శ్రీహరి మరో ముఖ్య పాత్రలో నటిస్తుండగా, గొడవ ఫేం శ్రద్ధఆర్య హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ సోమవారం నానక్‌రామ్‌గూడలోని సినీవిలేజ్‌లో ప్రారంభమైంది.

ఈ సందర్భంగా చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు సి. కళ్యాణ్ క్లాప్ కొట్టగా, శాంతిశ్రీహరి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. శ్రీహరి గౌరవ దర్శకత్వం వహించారు. శ్రీహరి మాట్లాడుతూ ఓ ఫోన్‌కాల్ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందన్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఆర్యన్ పాత్ర, తనపాత్ర పోటాపోటీగా ఉంటుందన్నారు.

ఆర్యన్ రాజేష్ మాట్లాడుతూ ఏడాదిన్నరపైగా ఎదురుచూస్తున్న సబ్జెక్ట్. మంచి థ్రిల్లింగ్‌గా చిత్రం ఉంటుందన్నారు. శ్రీహరి నటించడం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అవుతుందన్నారు. దర్శకుడు రామకృష్ణ మాట్లాడుతూ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు ఉందంటూ వచ్చే ఓ ఫోన్‌కాల్ ఎంత అలజడిని సృష్టించిందన్న కథాంశంతో చిత్రం సాగుతుందన్నారు.

ఈరోజు నుంచి రెగులర్ షూటింగ్ ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. మొత్తం నాలుగు షెడ్యూల్స్‌లో చిత్రాన్ని పూర్తి చేస్తామని ఆయన అన్నారు. చిత్ర నిర్మాత ఎల్. ఈశ్వర్ మాట్లాడుతూ మంచి థ్రిల్లింగ్ పాయింట్‌తో మా బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామన్నారు. సంగీత దర్శకుడు అగస్త్యన్ మాట్లాడుతూ రెండు పాటల రికార్డింగా పూర్తయ్యిందని తెలిపారు.

ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో చంద్రమోహన్, చరణ్‌రాజ్, కోటశ్రీనివాసరావు, జీవా, అలీ, రఘుబాబు, కృష్ణభగవాన్, పృధ్వీరాజ్ తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి మాటలు- రత్నబాబు డైమండ్, పాటలు- వనమాలి, ఫైట్స్- గణేష్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం- రామకృష్ణ.