విలక్షణనటుడు ప్రకాష్‌రాజ్‌పై టాలీవుడ్ నిషేధం
|
నటుడిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న ప్రకాష్‌రాజ్ సరైన సమయానికి షూటింగ్‌కు రాకపోవడం, సహనటులతో సరిగా ప్రవర్తించకపోవడం, డేట్స్ ఇచ్చి షూటింగ్‌లకు డుమ్మా కొట్టడం లాంటి పనులు చేస్తూ నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారాడన్నది ప్రకాష్‌రాజ్‌పై ప్రధానంగా వినిపించే ఆరోపణ.
నటుడిగా కెరీర్ ప్రారంభించిన నాటినుంచి ప్రకాష్‌రాజ్‌పై ఇలాంటి విమర్శలు వినిపించడం సర్వసాధారణంగా మారింది. దీంతో ఆయా భాషల సినీపరిశ్రమలు ప్రకాష్‌రాజ్‌ని సినిమాల్లో నటించకుండా నిషేధం విధించాలి అని ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. మిగిలిన భాషల సంగతి ఎలా ఉన్నా... ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రం ప్రకాష్‌రాజ్‌పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రకాష్‌రాజ్‌పై వచ్చిన ఈ ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గు తేల్చడానికి నిర్మాతల మండలి ఓ కమిటీని నియమించి విచారణకు ఆదేశించింది.
ప్రకాష్‌రాజ్ నటన గురించి చెప్పాలంటే... ఎటువంటి పాత్రలోకైనా పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను ఆకట్టుకునే విలక్షణ నటుడుగా పేరుతెచ్చుకున్నాడు. ఏ పాత్ర చేసినా అందులో తనదంటూ ఓ ప్రత్యేకత చూపడం ప్రకాష్‌రాజ్‌కే చెల్లింది. చిన్న చిన్న పాత్రలతో తమిళంలో వెండితెర నటుడిగా ప్రవేశం చేసిన ప్రకాష్‌రాజ్ అటుపై దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించాడు.
ఏ భాషలో నటించినా ఆ భాషలోని నుడికారాన్ని చక్కగా పలికించగలిగే ప్రకాష్‌రాజ్ నటుడిగా పాత్రలకు జీవం పోశాడు. క్యారెక్టర్ నటుడిగా, విలన్‌గా, హీరోగా ఇలా అన్ని రకాల పాత్రల్లో తనకు ఎవరూ సాటిరారని నిరూపించాడు. ఓ సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి ప్రకాష్‌రాజ్ గురించి మాట్లాడుతూ అతను సామాన్యుడు కాదంటూ వ్యాఖ్యానించారు. అదీ ప్రకాష్‌రాజ్ గొప్పతనం.