1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

తమిళంలోనూ, తెలుగులోనూ వస్తోన్న ''1977''

తమిళంలో తెలుగులో 1977
WD PhotoWD
శరత్‌కుమార్ హీరోగా తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతోన్న 1977 చిత్రం ప్రస్తుతం టాకీ పార్ట్ పూర్తి చేసుకుని పాటల చిత్రీకరణకు సిద్థమవుతోంది. జి.ఎన్. దినేష్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శరత్‌కుమార్ ఆరు గెటప్పుల్లో కనిపించనుండడం విశేషం. 1977లో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది.

హాలీవుడ్ స్థాయి యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రంలో ఉంటాయని చిత్ర దర్శకుడు చెబుతున్నారు. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ చిత్ర హీరో శరత్‌కుమార్ మాట్లాడుతూ ఇది తాను నటిస్తున్న 107వ చిత్రమని అన్నారు.

ఇన్ని చిత్రాల్లో తాను నటించడానికి తనకు 25 ఏళ్లు పట్టిందని ఆయన తెలిపారు. ఈ చిత్రంలో తాను తండ్రీ, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. తమిళనాడులో ఓ మారుమూల పల్లెనుంచి మలేషియా వెళ్లే కథాంశంతో చిత్రం ఉంటుందని ఆయన చెప్పారు.

చిత్రంలోని 60 శాతం మలేషియాలో చిత్రీకరించబడిందని ఆయన తెలిపారు. ఈ చిత్రంలోని పాటలను జూలైలో చిత్రీకరించి చిత్రాన్ని ఆగస్ట్ 15 తర్వాత ప్రేక్షకుల ముందుకు తేనున్నామని ఆయన చెప్పారు.

ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో నమిత, జయసుధ, రాజ్, వివేక్, విజయ్‌కుమార్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం- విద్యాసాగర్, నిర్మాత- రామవాసు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం- జి.ఎన్. దినేష్‌కుమార్.