''మిస్టర్ గిరీశం''గా రమ్యకృష్ణతో కృష్ణభగవాన్
|
కృష్ణభగవాన్‌పై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు ఆర్.నారాయణమూర్తి క్లాప్ కొట్టగా, డి. రామానాయుడు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు విశ్వప్రసాద్ మాట్లాడుతూ గిరీశం పాత్ర గురించి ఆంధ్రులకు సుపరిచితమే అని అన్నారు. అయితే ఈ పాత్ర ఆధునికంగా ఎలా ఉంటుందన్నది తమ చిత్రంలో చూపించనున్నామని అన్నారు.
చిత్ర నిర్మాత మాట్లాడుతూ ఇప్పటికాలంలో మనకు ఎంతోమంది గిరీశంలు కనిపిస్తారు. అలాంటి వారికి ప్రతిరూపంగా ఈ చిత్రంలో కృష్ణభగవాన్ నటిస్తున్నారని చెప్పారు. హాస్యభరితంగా సాగే ఈ చిత్రంలో చక్కని సందేశం ఇమిడి ఉంటుందని ఆయన తెలిపారు. ఏకధాటిగా సాగే ఈ చిత్రం షూటింగ్ ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేయనున్నామని ఆయన వివరించారు.
కృష్ణభగవాన్ మాట్లాడుతూ గిరీశం పాత్రకు తనను ఎంపిక చేసినపుడు భయమేసిందని అన్నారు. అలనాడు ఎన్టీఆర్ పోషించిన ఆ పాత్రను నేను పోషించగలనా అని ఆలోచించాను అన్నారు. అయితే దర్శకుని మీద నమ్మకంతో తాను ఈ పాత్ర ధరించడానికి సిద్ధమయ్యానన్నారు.
సంగీత దర్శకుడు మాట్లాడుతూ ఈ చిత్రంలో నేపథ్య సంగీతాన్ని ప్రాధాన్యత ఎక్కువని ప్రస్తుతం ఈ చిత్రానికి ట్యూన్స్ సిద్థం చేస్తున్నామని తెలిపారు. ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో రమ్య, సిండ్రిలా, గోపాలకృష్ణ, చందు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా- రాజేష్ కాటా, మాటలు- యర్రంశెట్టి సాయి, ఆర్ట్- గోపి, ఎడిటర్- అనిరుద్ర, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం- విశ్వప్రసాద్.