హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా తన సత్తా నిరూపించుకున్న నటుడు సాయికుమార్. సాయికుమార్ నటించిన 'పోలీస్ స్టోరీ' చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ప్రస్తుతం సాయికుమార్ హీరోగా కొనసాగుతూనే తన కుమారుడు ఆదిత్యను హీరోగా పరిచయం చేయడానికి సన్నాహాలు ప్రారంభించారు.
ఆదిత్య హీరోగా పరిచయం కానున్న చిత్రానికి సురేంద్రరెడ్డి దర్శకత్వం వహించనున్నారు. సురేంద్రరెడ్డి దర్శకత్వం వహించిన తొలిచిత్రం 'అతనొక్కడే' సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం యంగ్ హీరో కళ్యాణ్‌రామ్‌కు తొలి హిట్ సినిమా కావడం విశేషం. అయితే సురేంద్రరెడ్డి దర్శకత్వం వహించిన రెండో చిత్రం 'అశోక్' మాత్రం ఆశించిన విజయాన్ని సాధించలేక పోయింది.
ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించాడు. ఆ తర్వాత సురేంద్రరెడ్డి దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా వచ్చిన 'అతిథి' చిత్రం విడుదలైంది. ఈ చిత్రం సైతం యావరేజ్ టాక్‌నే సొంతం చేసుకుంది. ఇలాంటి తరుణంలో సురేంద్రరెడ్డి ఆదిత్య పరిచయమవుతున్న చిత్రానికి దర్శకత్వం వహించనుండడం విశేషం.
సురేంద్రరెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని ఆర్.ఆర్. మూవీస్ సంస్థ నిర్మించనుంది. ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.