''కథానాయకుడు''గా మారిన రజనీ ''కుచేలుడు''
|
ఈ విషయంపై చిత్ర నిర్మాత సి.అశ్వనీదత్ విలేకరులతో మాట్లాడుతూ సినిమా షూటింగ్ పూర్తయిందన్నారు. మొత్తం సినిమాలో 80 శాతం మేరకు రామోజీ ఫిల్మ్‌సిటీలోనే పూర్తి చేసినట్టు చెప్పారు. ఇటీవలి కాలంలో భారీ సెట్ వేసి ఒక చిత్రం షూటింగ్ పూర్తి చేయడం ఇదే తొలిసారి. ఈనెల 30న చిత్ర ఆడియోను చెన్నైలో విడుదల చేస్తామన్నారు. ప్రముఖ దర్శకుడు ఏఆర్.రెహ్మాన్ మేనల్లుడు జివి.ప్రకాష్ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రంలో గత 22 సంవత్సరాల్లో ఎన్నడూ ప్రదర్శించని విధంగా రజనీకాంత్ నటన ఉంటుందన్నారు.
ఇందులోని పాటలను వేటూరి, అనంత శ్రీరామ్, రామ గోజయ్య శాస్త్రి రాశారని చెప్పారు. 'కథానాయకుడు' పేరుతో వచ్చిన చిత్రాలన్నీ విజయవంతమైనట్టు గుర్తు చేశారు. రజనీకాంత్‌తో చిత్రం చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. రజనీతో సినిమా చేయాలనే కోరిక ఎప్పటి నుంచో ఉందని, ఆ కోరిక ఇప్పటికి తీరిందన్నారు.
దర్శకుడు పి.వాసు మాట్లాడుతూ.. వైజయంతీ బేనర్‌లో చేయడం గర్వంగా ఉందని రజనీ అనేవారనీ, అలాగే నాకూ కూడా ఈ బేనర్‌లో చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. 'కథానాయకుడు' మంచి చిత్రం అవుతుందనే నమ్మకం ఉందని చెప్పారు. రజనీ సరసన నయనతార, మమతా మోహన్‌దాస్, జగపతి బాబు, మీనా తదితరులు నటించారు.