రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎమ్మెస్సార్...
|
ఆయన నిజాయితీగానే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. దీనికి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదెలాగంటే.. హీరో రాజశేఖర్ నటిస్తున్న 'సత్యమేవ జయతే' అనే చిత్రంలో ఎమ్మెస్సార్ ముఖ్యమంత్రి పాత్రలో వెండితెరపై కనిపించనున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఎన్నో విధాలుగా తన తెలివితేటలను ప్రదర్శించిన ఈ రాజకీయ వృద్ధుడు.. తాజాగా వెండితెరపై తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించబోతున్నారు.
దీనిపై ఎం.సత్యనారాయణ రావు మాట్లాడుతూ ప్రత్యక్ష రాజకీయాల్లో ఎన్నో పదవులను చేపట్టి, వాటిని సమర్థవంతంగా నిర్వహించాను. అయినా ఎక్కడా సంతృప్తి లభించలేదు. సినిమాల్లో ముఖ్యమంత్రిగా నటించడంతో ధన్యుడిని అయ్యాను. ఈ పాత్రకు న్యాయం చేకూర్చుతా. ఈ చిత్రం విజయవంతమైతే నాకూ లాభం ఉంటుంది. నటించే నటీనటులతో సహా చిత్ర యూనిట్‌కు మేలు కలుగుతుంది. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధించాలని ఒక పెద్దవాడిగా దీవిస్తున్నాను అని ఎమ్మెస్సార్ అన్నారు.