1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

హాస్యతారకు ప్రముఖుల నివాళి

నేలరాలిన హాస్యతార  ప్రముఖ హాస్యనటుడు పీలా కాశీవిశ్వనాథ మల్లికార్జున రావు మంగళవారం
WD PhotoWD
ప్రముఖ హాస్యనటుడు పీలా కాశీవిశ్వనాథ మల్లికార్జున రావు మంగళవారం కన్నుమూశారు. ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించారు. కొద్దికాలంగా ఆయన లుకేమియా వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. రెండురోజులు చికిత్స అనంతరం మంగళవారం ఉదయం 10.50 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు డాక్టర్లు ధృవీకరించారు.

ప్రజల సందర్శనార్థం ఫిలింఛాంబర్‌కు ఆయన భౌతిక కాయాన్ని తరలించారు. బుధవారం నాడు ఆయన స్వస్థలమైన అనకాపల్లిలో అంత్యక్రియలు జరుగనున్నాయి. మల్లికార్జున రావు మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలియజేశారు.

మల్లికార్జునరావుకు 56 ఏళ్ళు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్నతనంలో రెండవ కుమారుడు వ్యాధితో చనిపోయారు. పెద్ద కుమారుడు ప్రస్తుతం జర్మనీలో ఉన్నారు. నాటకరంగంలో ఆయనకు విస్తృత అనుభవముంది. సినిమా రంగానికి అదే బాటవేసింది. 27 ఏళ్ళ నటనా కెరీర్‌లో ఆయన 375 చిత్రాల్లో వివిధ పాత్రలను పోషించారు. గురువు రావుగోపాలరావు ద్వారా తులసి (1973)లో ఆయనకు చిన్నవేషం దక్కింది.

ఆ తర్వాత "నాగమల్లి"లో నటించారు. కానీ వంశీ దర్శకత్వంలో రూపొందిన "లేడిస్ టైలర్"లో ఆయన పోషించిన బట్టల సత్యం ఆయన కెరీర్‌నే మార్చేసింది. ఏప్రిల్ 1 విడుదల, అనుమానాస్పదం, జంబలకిడిపంబ వంటి ఎన్నో చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు.

"తమ్ముడు" చిత్రంలో నటనకు ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఇకపోతే మల్లికార్జున రావుకు తెలుగుదేశంతో అనుబంధముంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల్లో ప్రచారం చేశారు. ప్రస్తుతం తెదేపా సాంస్కృతిక విభాగ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.

అదే విధంగా గతంలో "మా" ఉపాధ్యక్షుడుగానూ, ప్రస్తుతం "మా" కార్యదర్శి బాధ్యతలు పోషిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన నటించిన ఆఖరి చిత్రం "మహా నగరంలో..." ఇది ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది.


ప్రముఖుల నివాళులు :
మల్లికార్జునరావు మృతికి నివాళిగా మంగళవారం నాడు షూటింగ్‌లన్నీ రద్దయ్యాయి. పలువురు సినీరంగ ప్రముఖులు అపోలో ఆసుపత్రిలో ఆయన భౌతికకాయాన్ని సందర్శించారు.

అనంతరం ఫిలింఛాంబర్‌లో ప్రజల సందర్శనార్థం భౌతికకాయాన్ని వుంచారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్థాపకుడు మెగాస్టార్ చిరంజీవి, మా అధ్యక్షుడు నాగబాబు, బాలకృష్ణ డా. డి. రామానాయుడు, అక్కినేని నాగేశ్వరరావు, ఏవీఎస్, గౌతంరాజు, అలీ, ఇ.వి.వి. సత్యనారాయణ, బ్రహ్మానందం, సునీల్ తదితరులు నివాళులర్పించారు. సినీరంగ ప్రముఖులు మల్లికార్జునరావుతో తమకు గల సాన్నిహిత్యం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

అందరితో కలిసిపోయేవాడు : చిరంజీవి
నేను ఆయనతో కలిసి ఎన్ని చిత్రాల్లో నటించాన్న సంగతి పక్కనబెడితే... ఆయన చాలా మంచి నటుడు, వ్యక్తి. మూవీ ఆర్టిస్టు సెక్రటరీగా చిత్ర పరిశ్రకు ఎనలేని సేవలు చేశాడు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరితో కలిసిపోయేవాడు. ఆయన చనిపోవడం చిత్ర పరిశ్రమకు లోటు.

తలలో నాలుకలా వుండేవారు : బాలకృష్ణ
చక్కని కమెడియన్. అందరితో తలలో నాలుకలా వుండేవాడు. మా అసోసియేషన్ తలపెట్టిన వివిధ కార్యక్రమాలను భుజాన వేసుకునేవారు. ఆయన లేడనడం చాలా బాధగా వుంది.

ప్రసాదం వస్తే ఆయన వచ్చినట్లే : రామానాయుడ
ఆయన సెట్లోకి వస్తే దైవ సన్నిధానం ప్రసాదం వచ్చేది. అంటే ఆయన సెట్లోకి ప్రవేశించారని అర్థమయ్యేది. మంచి వ్యక్తి

తీరని లోటు : నాగబాబ
మల్లికార్జునరావు మృతి తీరని లోటని, మంచి నటునిగా, మంచి వ్యక్తిగా అందరిలోనూ నిలిచారని, తనకిచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారని "మా" అధ్యక్షుడు నాగబాబు తెలిపారు.

దిగ్ర్భాంతికి గురయ్యా : మోహన్ బాబ
అస్సాం షూటింగ్లో ఉన్న తనకు మల్లికార్జున రావు మరణవార్త తెలిసి, తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యాయని, మంచి నటుడిగా పేరు పొందారని, ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు.

కండల కాంతారావు : అల
హాస్యనటులంతా అన్నదమ్ములుగా మెలిగేవాళ్ళమని, ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ షూటింగ్‌లో సరదాగా గడిపేవాళ్ళమని, అందరితోనూ ఇమిడిపోయే స్వభావం ఆయనదని, ఆరోగ్యవిషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకునేవారని, ఉదయమే యోగా చేసేవారని, కండలు చూసి ఆయన్ను కండల కాంతారావు అని సరదాగా పిలిచేవాడినని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆయన మా మధ్య లేదనడం ఇంకా నమ్మశక్యం కాలేదని ఆయన చెప్పారు.

ప్రాణమిత్రుడు : ఎల్.బి.శ్రీరామ
మల్లికార్జునరావు నాకు ప్రాణమిత్రుడని, ఎన్నో విషయాల్లో సహకారాలు అందించే వాడని, నటునిగా కొత్తలో నన్ను అందరి దర్శకుల దగ్గరకు పరిచయం చేసేవారని అన్నారు.

అజాతశత్రువు : ఏవీఎస
సినిమా రంగంలో అజాతశత్రువు మల్లికార్జునరావుగారని, ఆయనలేని లోటు పూడ్చలేనిదని, ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు ఏవీఎస్ చెప్పారు.
About Writer
Selvi