సాయివర్ష సినీ అకాడమి నూతన నిర్మాణ సంస్థ "కవి" అనే చిత్రాన్ని ప్రారంభించింది. సికిందర్, కీర్తి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సి.హెచ్. హరిశంకర్ నిర్మాత సారథ్యం వహిస్తున్నారు. సెవెన్‌స్టార్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో హీరోహీరోయిన్లపై చిత్రించిన ముహూర్తపు షాట్‌కు ఇ.వి.వి. సత్యనారాయణ క్లాప్ కొట్టగా, అచ్చిరెడ్డి కెమేరా స్విచ్చాన్ చేశారు.
ఎస్వీకృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్రం గురించి తెలియజేస్తూ.. ఇందులో కథానాయకుడు కవితలు రాస్తుంటాడని, అతని కవిత్వం ద్వారా జరిగే చిన్న సంఘటన ఎలాంటి కష్టాలపాలు చేస్తుందని, వాటిన నుంచి అతనెలా బయటపడ్డాడనే కథాంశంతో చిత్రం రూపొందనుందని అన్నారు.
సోమవారం నుంచి 15వ తేదీ వరకు జరిగే తొలి షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుందని, తర్వాత నెలాఖరు నుంచి పూర్తయ్యే వరకు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తామని అన్నారు. నటి కవిత మాట్లాడుతూ... హీరోయిన్ తల్లిగా నటిస్తున్నానని చెప్పారు. నటి కీర్తి మాట్లాడుతూ.. తాను తొలిసారిగా కన్నడ చిత్రంలో నటించానని, తెలుగులో "స్ట్రీట్ బాయ్స్"లో నటిస్తున్నానని, ఇది తనకు మూడవ చిత్రమని తెలిపారు. ఈ సినిమాలో గ్రామీణ యువతిగా నటిస్తున్నానని వెల్లడించారు.
హీరో సికిందర్ మాట్లాడుతూ... ఇది తనకు తొలి చిత్రమని, ఈ చిత్రం తమ బేనర్‌కు, తమకూ మంచి పేరుతెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సంగీత దర్శకుడు మల్లిక్ మాట్లాడుతూ...ఇందులో ఆరు పాటలున్నాయని, ఇప్పటికే రీరికార్డింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయని చెప్పారు.
|