అల్లరి నరేష్ కధానాయకుడుగా నటిస్తోన్న "బ్లేడ్ బాబ్జీ" చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం రాత్రి మాదాపూర్‌లోని ఆర్ట్ గ్యాలరీలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య ఆతిథి అల్లు అరవింద్ విచ్చేసి ఆడియో సీడీని ఆవిష్కరించి కోడిరామకృష్ణకు అందించారు.
ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ... ఈ ఆడియో ఆవిష్కరణకు తాను రావడానికి ప్రత్యేక కారణం ఉందన్నారు. ఈ చిత్రానికి సీనియర్ నిర్మాత జయకృష్ణ కుమారుడు ముద్దుకృష్ణ నిర్మతగా ఉండాల్సిందన్నారు. ఆయన ఇక్కడ లేకపోవడం దురదృష్టకరమన్నారు.
కాగా.. ఈ తరుణంలో వారి అల్లుడు ముత్యాల సత్యకుమార్ ఈ చిత్రానికి నిర్మాత సారధ్యం వహిస్తున్నందునే వచ్చానన్నారు. పోతే సినిమా గురించి చెప్పాలంటే... అల్లరి నరేష్ నటించిన చిత్రాలను చూడాలంటే తమకు ఉత్సాహం వేస్తుందన్నారు. "గమ్యం" చిత్రంలో చక్కని పెర్‌ఫార్మెన్స్ చేశారని, దాన్ని ఇంకా ప్రమోట్ చేస్తే మరింత విజయం వచ్చిఉండేదని ఆయన వెల్లడించారు. తన కుటుంబమంతా నరేష్ నటించిన చిత్రాలు ఎంతో ఆసక్తిగా చూస్తారన్నారు. నరేష్ భవిష్యత్‌లో మరింతగా ఎదగాలని ఆశిస్తున్నాట్లు వెల్లడించారు.
కోడిరామకృష్ణ స్పందిస్తూ... సినిమా విజయానికి టైటిల్ చాలా దోహదం చేస్తుందన్నారు. ఈ చిత్రానికి తగిన టైటిల్ హీరో నరేష్, మనకు హీరోలు, విలన్‌లు కొరత ఏదోరకంగా తీరుతుందన్నారు. కానీ కామెడీ పాత్రలు, సెంటిమెంటు పాత్రలును పోషించే చలం కొరత చాలా కాలం భర్తీకాలేదన్నారు. ఇప్పుడు ఆ కొరత నరేష్‌తో పూర్తయిందని, సీమశాస్త్రిలో ఎంటర్‌టైన్‌మెంట్, సెంటిమెంట్ నరేష్ చక్కగా పోషించాడన్నారు.
ఇకపోతే దేవీప్రసాద్ తమ దగ్గర అసిస్టెంట్‌గా పని చేశాడని, ఆయనలో ఆర్టీస్టు కూడా దాగివున్నాడన్నారు. ఈ చిత్రానికి కోటి చక్కని సంగీతాన్ని అందించాడని, ఈ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందన్నారు. రాజేంద్రప్రసాద్ తరహా పాత్రల్ని నరేష్ పోషించి ఉంటాడని ఎస్. వి. కృష్ణరెడ్డి అభిప్రాయపడ్డారు.
|