విశాల్ "సెల్యూట్" ఆడియో ఆవిష్కరణ
|
ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ... విశాల్ నటించిన "పందెంకోడి" చిత్రాన్ని తాను ఎందుకు చేయలేకపోయానా? అనిపించిందన్నారు. "పందెంకోడి" తనకు నచ్చిన కథని, నిజం చెప్పాలంటే... "పందెంకోడి" చిత్రంలో విశాల్ చాలా బాగా నటించాడన్నారు. భవిష్యత్‌లో ఇంకా ఉన్నతస్థితికి ఎదగాలని కోరుకుంటున్నానని, అలాగే విక్రమ్‌కృష్ణ, విశాల్‌ల అనుబంధం నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు.
వి.వి నాయక్ మాట్లాడుతూ... తన కొడుకులిద్దరిలో ఒకరిని నిర్మాతగా మరొకరిని హీరోగా చేసిన డాక్టర్ డి. రామానాయుడు తర్వాత అదే స్థానానికి చేరువవుతానని భావిస్తున్నట్లు తెలిపారు. విశాల్ గత చిత్రాలకంటే ఈ చిత్రంలో బాడీని బాగా డెవలప్ చేశాడని అన్నారు.
సురేష్‌కృష్ణ మాట్లాడుతూ... తనవద్ద అసిస్టెంట్‌గా పని చేసిన రాజ్ కుమార్ గొప్ప దర్శకుడు కావాలని ఆశిస్తున్నానని, ఈ సినిమా ట్రైలర్స్ చూశానని, చాలా బాగా కుదిరాయని చెప్పారు. ఈ చిత్రం తర్వాత విశాల్ అంచనాలు ఎక్కువవుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. తర్వాతి చిత్రాల్లో కాస్త జాగ్రత్త పడాల్సి వస్తుందని సూచించారు.
దిల్ రాజు మాట్లాడుతూ...... విశాల్ తొలి సినిమాలోనే మంచి టాలెంట్ చూపారని, ఈ సినిమాలో ట్రైలర్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయన్నారు. "బొమ్మరిల్లు" చిత్రాన్ని విశాల్‌తో చేయాలనుకున్నామని, కానీ ఆ అవకాశం కుదరలేదన్నారు. ఈ చిత్రాన్ని నైజాం, వైజాగ్‌లలో వెంకటేశ్వర ఫిలింస్ ద్వారా విడుదల చేస్తున్నామని ఈ సందర్భంలో తెలిపారు.
సినిమా దర్శకుడు రాజశేఖర్ మాట్లాడుతూ... ఇది ద్విభాషా చిత్రమని, తమిళంలో "సత్యం" అనే టైటిల్ పెట్టామని అన్నారు. ఈ చిత్రానికి హరీష్‌జైరాజ్ చక్కని సంగీతాన్ని సమకూర్చారని, ఇది ఆయనకు 25వ సినిమా అన్నారు. ఇందులో 5 పాటలున్నాయని యానిమేషన్ కింగ్‌డమ్ స్థాయిలో ఓ పాట పిల్లలతో చిత్రించామన్నారు. దీనికి 1.75 కోట్లు ఖర్చయిందని, మరో సాంగ్‌లో విశాల్ బాడీని పెంచుకున్నాక చిత్రించామన్నారు.
నటుడు విశాల్ మాట్లాడుతూ.... జూనియర్ ఎన్‌టీఆర్ నటించిన "రాఖీ" చిత్రాన్ని 36 సార్లు చూశానని, అందులో రైల్వేస్టేషన్‌లో ఆయన చెప్పే డైలాంగ్‌లు తనను ఎంతగానో ఆకర్షించాయని విశాల్ తెలిపారు. సెల్యూట్ సినిమా కూడా డైలాగ్‌కు బెస్ట్ చిత్రమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
"సెల్యూట్" లాంటి సినిమాలో మళ్ళీ నటించలేనని, దీనికోసం చాలా కష్టపడ్డానని టీమ్ వర్క్‌తో పూర్తిచేశామని విశాల్ అన్నారు. పోలీస్ ఆఫీసర్‌గా నటించిన ఈ సినిమాను ఛాలెంజ్‌గా తీసుకున్నానని, ఈ చిత్రంతో నాన్నగారి కోరిక నెరవేరుతుందన్నారు. ఈ చిత్రం నా కెరీర్‌కు గీటురాయిలా నిలుస్తుందన్నారు. అన్ని కార్యక్రమాలను ముగించుకుని ఆగస్టు ఒకటో తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఛార్మి, వెన్నెల కంటి సాహితీ హేమ తదితరులు పాల్గొని ప్రసంగించారు.