1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

బాలీవుడ్‌లో కాసుల పంట..

బాలీవుడ్‌లో కాసుల పంట..
బాలీవుడ్‌లో కాసుల పంట పండుతోంది. ఒక్క సినిమా హిట్టయితే చాలు... ఇక వెనుదిరిగి చూసుకోనక్కరలేదు. ధనలక్ష్మి తనంతట తానే వచ్చి తలుపు తడుతుంది. ఆశ్చర్యపోతున్నారా...? ఈ క్రింది విషయాలను చూస్తే అర్థమవుతుంది. "జానే తూ యా జానే నా" చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం విజయం తర్వాత ఇమ్రాన్ ఖాన్ తన రెమ్యునరేషన్‌ను రూ. 7 కోట్లకు పెంచినట్లు విశ్వసనీయ సమాచారం.

"జానే తూ యా జానే నా" చిత్రం మాత్రం సుమారు రూ. 30 కోట్ల మేరకు కలెక్షన్లను వసూలు చేసి బాక్సాఫీసు బద్దలు కొట్టింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ సూపర్ హీరో స్థాయికి ఎదిగిపోయారు. ఇక మిగిలిన యువనటుల్లో ఒకరైన షాహిద్ కపూర్.. "వివాహ్", "జబ్ వుయ్ మెట్" చిత్రాల్లో నటించారు. వీటితో పాటు తాజాగా షాహిద్ నటించిన "కిస్‌మత్ కనెక్షన్‌" కూడా ఓ మోస్తరు విజయాన్ని సాధించింది. ఇక షాహిద్ కపూర్ ప్రస్తుతం దాదాపు రూ. 8 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు వినికిడి.

అలాగే రిషి కపూర్ తనయుడు రణభీర్ కపూర్ నటించిన "సావారియా" చిత్రం ఆశించిన మేర విజయాన్ని అందుకోలేక పోయిన సంగతి తెలిసిందే. అయితే రణభీర్ మాత్రం తర్వాతి చిత్రానికి రూ. 6 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. రాజ్ కుమార్ సంతోషి, మణి రత్నం, యాష్‌రాజ్ ఫిలిమ్స్, కరన్ జోహార్, ప్రకాష్ ఝా తదితరులతో రణభీర్ వివిధ చిత్రాలను చేయనున్నాడు.

నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ పీకలలోతు నష్టాల్లో కూరుకుపోయిందంటూ గతంలో నిపుణులు విశ్లేషించారు. అయితే నేటితరం తారలతో మళ్లీ బాలీవుడ్ కాసుల పంట పండించనున్నట్లు వెల్లడిస్తున్నారు. బాలీవుడ్‌లో అడుగిడిన నటీనటులు... నటించిన చిత్రాల ద్వారా స్టార్‌డమ్ వచ్చినా రాకపోయినా తదుపరి చిత్రానికి తన రెమ్యునరేషన్ మాత్రం పెంచేస్తున్నారు.
ఈ విషయంపై ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ మాట్లాడుతూ నేటితరం తారలకు ధనం పట్ల విపరీతమైన మోజు కలిగి వున్నారన్నారు. గత తరం నటీనటుల్లో ఈ వ్యామోహం ఉన్నప్పటికీ.. ప్రస్తుత స్థాయిలో లేకపోవడం గమనించాల్సి అంశమని ఆయన విశ్లేషించారు.

ఒక చిత్రం విజయం సాధిస్తే వెంటనే ఎనిమిది అంకెల సంఖ్యను డిమాండ్ చేస్తుండటం దీనికి అద్దం పడుతుందని మహేష్ వ్యాఖ్యానించారు. ఇక తాజాగా బాలీవుడ్‌లో రేగుతున్న పుకార్లలో అగ్ర హీరో అక్షయ్ కుమార్.... హాలీవుడ్ సంస్థ స్టూడియో 18 రూపొందిస్తున్న "సింగ్ ఈజ్ కింగ్" చిత్రంలో నటించేందుగాను సుమారు రూ. 50 కోట్లు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఇదే చిత్రంలో అక్షయ్‌తో పాటు నటిస్తున్న అనీజ్ బాజ్మీ రూ. 15 కోట్లు తీసుకున్నాడట.

హాలీవుడ్ సంస్థ స్టూడియో 18 అక్షయ్-అనీజ్‌లతో ఓ వైపు ఒప్పందం చేసుకుంటూనే... సింగ్ ఈజ్ కింగ్‌కు ప్రపంచవ్యాప్తంగా హక్కులను ఇచ్చినందుకు గాను స్టూడియో 18 రూ. 62 కోట్లు రాబట్టింది. సింగ్ ఈజ్ కింగ్ చిత్ర నిర్మాత విపుల్ షా మాట్లాడుతూ ప్రేక్షకుల్లో అక్షయ్ కుమార్‌కు అంతులేని అభిమానాన్ని చూరగొన్నాడని తెలిపారు. ఓ టెలివిజన్ షో (ఖాతరోన్ కి కిలాడి)లో అక్షయ్ నటించనందుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారని వ్యాఖ్యానించారు. అయితే ఆ టీవీ షోకు సంబంధించిన రెమ్యునరేషన్‌పై ఇంకా చర్చలు జరుగుతున్నాయని.. దీనికి కూడా భారీ మొత్తంలోనే ఉండవచ్చని వివరించారు.

మరోవైపు సైఫ్ ఆలీఖాన్, కరీనా కపూర్‌లు జంటగా నటించిన చిత్రం "తషాన్" బోల్తా కొట్టింది. అయినప్పటికీ వీరిద్దరికీ ఆష్టవినాయక్ ఫిలిమ్స్ రూ. 27 కోట్లు ఇచ్చినట్లు భోగట్టా. ఈ పరిణామం బాలీవుడ్‌లో పెను సంచలనాన్నే సృష్టించింది. చిత్ర ఫలితాలు తారుమారైనా దాని మాట అటుంచి నజరానాలివ్వడం అందరినీ విస్తు గొలిపింది. దీనికితోడు సైఫ్, కరీనాలు ఏకంగా తమ జోడీకీ ఓ ప్యాకేజీని నిర్ణయించుకున్నారు. వారిద్దరికీ అనుగుణంగా అష్టవినాయక్ ఫిలిమ్స్ 2009లో నిర్మించే చిత్రం కోసం ఇప్పుడే వారితో ఒప్పందం కూడా చేసేసుకుంది. ఈ క్రమంలో వారిద్దరికీ కలిపి తొలి విడత పారితోషికంగా రూ. 7.5 కోట్లను చెల్లించుకుందట. బాలీవుడ్ అంటే మజాకానా మరి...
About Writer
Hanumantha Reddy