బేతాళుడికథలో విక్రమార్కుడిలా చెట్టుపై శవాన్నిమోసుకుని కథ నివృత్తి అయ్యాక మళ్ళీ చెట్టెక్కినట్లు తన పరిస్థితి ఉంటుందని రామ్ గోపాల్ వర్మ చెబుతున్నారు. సినిమా ఫెయిల్యూర్ అయినా మళ్ళీ విక్రమార్కుడిలా చెట్టెక్కి శవాన్ని తీసుకున్నట్లుగా సినిమా తీస్తున్నానని ఆయన చెప్పారు.
మాఫియా చిత్రాలతో పాటు హార్రర్ చిత్రాలు తీస్తున్న వర్మ గతంలో "రాత్రి" అనే చిత్రాన్ని రూపొందించారు. ఆ చిత్రం పెద్దగా ఆదరణనోచుకోకపోవడంతో తనకు భయపెట్టడం రాదని స్టేట్‌మెంట్ ఇచ్చారు. తాజాగా "ఫూంఖ్" అనే హిందీ చిత్రానికి దర్శకత్వం వహించారు. క్షుద్రశక్తులు, మూఢనమ్మకాల చుట్టూ తిరిగే కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆదివారం రామ్‌గోపాల్ వర్మ హైదరాబాద్ వచ్చారు.
ఈ సందర్భంగా పి.వి.ఆర్ థియేటర్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వర్మ పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఇందులో భాగంగా భయపెట్టడం రాదన్న మీరు "ఫూంఖ్" ద్వారా మళ్ళీ భయపెట్టడానికి కారణమేమిటని ప్రశ్నించగా... అలా అన్నానా... అంటూ... తనది కుక్కతోక వంకరలా ఉంటుందని చెబుతూ... బేతాళుడి కథను చెప్పారు.
ఫూంఖ్ నేపథ్యాన్ని వివరిస్తూ... తాను కాలేజ్ చదివే రోజుల్లోనే యండమూరి "తులసీదళం" చదివి చాలా ఇన్‌స్పైర్ అయ్యానని, "ఫూంఖ్" కథకు మూలం అదే అయినా ట్రీట్‌మెంట్ వేరుగా ఉంటుందని చెప్పారు. ఇది ఒక పాప చుట్టూ తిరిగే కథని, మన ఇంట్లో ఇలాంటివి జరిగితే ఎలా ఉంటుంది? దాన్ని ఎలా ఎదుర్కొంటాం అనేది ఈ చిత్రంలో చూపించామని బదులిచ్చారు.
ఇటువంటి చిత్రాలు తీస్తూ మూఢనమ్మకాల్ని ప్రోత్సహిస్తున్నారా? అనే ప్రశ్నకు.. ఇది నమ్మకానికి, అపనమ్మకానికి మధ్య జరిగే యుద్ధమని, ఇలాంటి వాటిని నమ్మమని చెప్పడం లేదని స్పష్టం చేశారు. సినిమా తీయడం వరకే నా బాధ్యత అని, చూడటం, చూడకపోవడం ప్రేక్షకులకే వదిలేస్తున్నట్లు అన్నారు.
సినిమాల ప్రభావం సమాజంపై ఎలా ప్రభావితం చేస్తుందన్న ప్రశ్నకు... అలా ప్రభావితం చేస్తే "హమ్ ఆప్‌కే హై కౌన్" తరహాలా అందరూ జాయింట్ ఫ్యామిలీవైపు మొగ్గుచూపాలి కదా! అని ప్రశ్నించారు. వీరప్పన్ చిత్ర నిర్మాణంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవములని తేల్చిచెప్పారు.
ఆ సినిమా తీస్తున్నట్లు ప్రకటించినప్పటికీ... తనకు బెదిరింపులు రాలేదని, తనకేం భయంలేదని వర్మ ధీమా వ్యక్తం చేశారు. అయినా వీరప్పన్‌పై చాలా ఆర్టికల్స్, కథలు కూడా వచ్చాయని గుర్తు చేసిన రామ్ గోపాల్ వర్మ... అన్నమయ్య, శ్రీరామదాసు వంటి చిత్రాలు తాను తీస్తే... గోవిందా... గోవిందా.. అంటూ చమత్కరించారు. ఒంటరిగా థియేటర్లో కూర్చుని సినిమా చూసిన వారికి 5లక్షల నజరానాను నిర్మాత ప్రకటించారనీ, ఇదంతా ప్రమోషన్‌లో భాగమేనని తేల్చిచెప్పారు.
హిందీలో గతంలో ఇటువంటి చిత్రాలు వచ్చినా, వాటికీ ఫూంఖ్ చిత్రానికి చాలా వ్యత్యాసముందని పేర్కొన్నారు. హిందీలోనే ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుందని వెల్లడించారు. ఒన్‌మోర్ టచ్ ప్రొడక్షన్స్‌పై అజామ్‌ఖాన్ ఈ సినిమాకు నిర్మాణ సారథ్యం వహించారు.
|