'పొగతాగనివాడు దున్నపోతై పుట్టు' అన్నాడు కన్యాశుల్కంలో గిరీశం. గురజాడ కలం నుంచి జాలువారిన ఈ మాటల్లో ఎంతటి మహత్తు ఉందో తెలియదు గానీ మనలో చాలామంది ఈమాటను తూచా తప్పకుండా పాటించేస్తున్న సంగతి తెలిసిందే.
వచ్చే జన్మలో తాము దున్నపోతులుగా పుట్టకూడదని తలచారో ఏమో చాలామంది సెలబ్రిటీలు సైతం గుప్పు గుప్పుమని పొగ పీల్చేస్తూ అందులోని ఆనందాన్ని, సంతోషాన్ని ఆస్వాదిస్తున్నారు.
పొగతాగడం ఆరోగ్యానికి హానికరం కదా... అలాంటిది సెలబ్రిటీగా ఉన్న మీరే ఇలా పబ్లిక్‌గా పొగత్రాగేస్తుంటే మిమ్మల్ని చూచి మరికొంతమంది అలాగే తయారు కారా... అంటే పొగ పీల్చడం మా సృజనాత్మక హక్కు దాని గురించి దయచేసి ప్రశ్నించవద్దంటూ అంటూ ఆ మధ్య చిరుబురులాడిన బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ ప్రస్తుతం పొగత్రాగడం మానేయనున్నట్టు ప్రకటించారు.
అయితే షారుక్ పొగతాగడం మానేయబోతోంది తన ఆరోగ్యం గురించి చింతించీ కాదు. అలాగే ఇతరులు చెప్పిన నీతి వాక్యాలు విని కూడా కాదు. మరి ఎందుకు మానేస్తున్నారంటే ఆయన పిల్లల కోరిక మేరకేనట.
ఓ తమిళ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్న సందర్భంగా ఆయన మలయాళ మనోరమ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షారుక్ పై విధంగా పేర్కొన్నారు. నా పిల్లలకు నా అలవాటు నచ్చలేదు. అందుకే వారి ఒత్తిడి మేరకు నేను పొగతాగడం మానేయ దలిచాను అంటూ షారుక్ వివరించారు.
దాదాపు 22 ఏళ్లుగా తనకున్న ఈ అలవాటును తన పిల్లల కోసం తాను ఖచ్చితంగా వదిలేయగలనని ఈ సందర్భంగా షారుక్ విశ్వాసం వ్యక్తం చేశారు.
|